ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తలకొండపల్లి మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కోచింగ్ సెంటర్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర సీఓఓ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, శ్రీ విశ్వ అకాడమీ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కోచింగ్ తరగతులు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం కానుండగా, అనుభవజ్ఞులైన స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ బృందం శిక్షణ అందించనుంది. ప్రతిరోజూ 9 గంటల పాటు క్లాసులు నిర్వహించి, రోజువారీ టెస్టులు, వారాంత గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. నూతన సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు నాన్-మ్యాథ్స్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.
తలకొండపల్లి మండల కేంద్రంలోని రెడ్డి మేస్ కాంప్లెక్స్‌లో కోచింగ్ సెంటర్ నిర్వహించనున్నట్లు యువ నాయకుడు పెరుమండ్ల సురేష్ (B.Ed) తెలిపారు. మండలంలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలని ఆయన కోరారు.