Take a fresh look at your lifestyle.

మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి

  • జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : రైతుల నుండి సేకరించిన వడ్లను మిల్లింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని సద్గురు రాఘవేంద్ర పారాబైల్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు ఎంత ధాన్యం వస్తుంది, ఎంత మొత్తంలో వచ్చిన వరి ధాన్యాన్ని బియ్యం గా మారుస్తూన్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మిల్లులో ఉన్న బియ్యం నిల్వలను పరిశీలించారు. పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ ను వెంటనే ఎఫ్ సి ఐ కి తరలించాలని యాజమాన్యానికి కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేసుకున్నారా, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లులో ఏమైనా తరుగు తీస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. ముందస్తుగానే రుతు పవనాల ప్రవేశంతో వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని వెంటవెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు.ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయ్యిందని, చివరి దశలో మిగిలిన ధాన్యం నిల్వలను కూడా సకాలంలో దిగుమతి చేసుకుని సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ ప్రక్రియను చేయాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, తహసిల్దార్ ఇబ్రహీం, మిల్లు యజమాని రమేష్ బాబు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.