ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయోపరిమితిని మరో 10 ఏళ్ల పాటు సడలించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ లు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వేర్వురుగా కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పదేళ్ల పాటు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదని, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం కూడా పదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసిందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ 20 ఏళ్ల కాలంలో సరైన నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి, అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతి అని, ఈ నేపథ్యంలో అభ్యర్థులు నష్టపోకుండా ఉండాలంటే భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లలో వయోపరిమితిని పెంచాలని కోరారు. తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి పొందే అవకాశం లభిస్తుందన్నారు. కాగా ఈ విన్నపంపై భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగులకు సంబందించిన ఈ సమస్య గురించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం వయోపరిమితి సడలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.