Take a fresh look at your lifestyle.

సీతారామా ప్రాజెక్టుపై కాంగ్రెస్ ది  తప్పుడు ప్రచారం 

  • బీఆర్ఎస్ హయంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు దగ్గద కాంగ్రెస్ నేతలు ఫోటో ఫోజులు ఇస్తున్నారు.
  • గత ప్రభుత్వమే 90 శాతం పనులు పూర్తి చేస్తే, కాంగ్రెస్ కేసులతో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసింది.
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేక, “అనుమతులు లేవు” అని అబద్ధాలు మాట్లాడడం దుర్మార్గం.
  • తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తిన మాజీ మంత్రి హరీశ్ రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: “నిజం మౌనంగా ఉంటే..అబద్ధమే రాజ్యం ఏలుతుంది.” ఈ సామెత కాంగ్రెస్ పార్టీ తీరుకు అతికినట్టు సరిపోతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.అబద్ధాలే ఆధారంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ధ్వజమెత్తారు.నిజం మౌనంగా ఉంటే, అసత్యమే నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది కనుక కాంగ్రెస్ చెబుతున్న ప్రతి అబద్ధానికి ఆధారాలతో సహా నిజాన్ని ప్రజల ముందుంచడం బీఆర్ఎస్ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. సీతారామ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితంచేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.మంత్రి  హోదాలో ఉండి ఉత్తమ్ అబద్దాలు ఆడడం సిగ్గుచేటని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ దగ్గరే మంత్రులు ఫోటోలకు పోజులిచ్చి, అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు ఇవ్వడం గత ప్రభుత్వ తపన అయితే..ఫొటోలకు పోజులివ్వడం కాంగ్రెస్ నేతల ఘనత అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు 50 ఏళ్లపాటు కాంగ్రెస్ పాలన సాగునీటిలో అన్యాయం చేస్తే.. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన సాగునీటి రంగంలో విజయ బావుటా ఎగరవేసిందని గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞంలో ధనదాహంతో కళ్లు మూసుకుని తెలంగాణ రైతులను అన్యాయంచేశారన్నారు..ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటిని ఆంధ్రాకు తాకట్టుపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రతి అంశంపై బీఆర్ఎస్ పాలనపై దుమ్మెత్తి పోయడం కాదు.. మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను ఇప్పటికైనా చిత్తశుద్ధితో పూర్తి చేయాలని కోరారు.
సీతారామ ప్రాజెక్టుపై 2018 అక్టోబర్ 30న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను కేంద్ర జల సంఘానికి నాటి  బీఆర్ఎస్ ప్రభుత్వం  అందజేసిందన్నారు. 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 113.795 టీఎంసీల నీళ్లు ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం నిర్ధారించిందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 70.4టీఎంసీల నీటిని వినియోగించి 6.74లక్షల ఎకరాలకు సాగు నీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఇవ్వొచ్చని, తాగునీటితోపాటు పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం 2021లోనే నిర్ధారించిందన్నారు..ఇంత స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్, హైడ్రాలజీ అనుమతులు ఉన్నమ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టుకు అనుమతులు లేవని మాట్లాడడం  మంత్రి ఉత్తమ్ చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే కాంగ్రెస్ నాయకులు..కేసీఆర్ చిత్తశుద్ధి గురించిమాట్లాడం హాస్యాస్పదమన్నారు.కృష్ణా నదిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఆంధ్ర పాలకులు గోదావరిలో నీటి దోపిడీకి పాల్పడుతుంటే, అడ్డుకునే సత్తా కాంగ్రెస్‌కు లేదన్నారు. ఏడాదిన్నర పాలనలో కనీసం ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేని స్థితిలో రేవంత్ సర్కార్ ఉండడం రాష్ట్రానికి శాపంగా మారనుందన్నారు.అలాగే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు నష్టం కలిగించి ఆంధ్రాకు లాభం చేకూర్చేలా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదా?. ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ హెడ్ వర్క్ ఆంధ్రాలో పెట్టి, శాశ్వతంగా తాళం వేసింది మీకు కదా? అని ప్రశ్నించారు.  రాజీవ్ సాగర్ పైప్‌లైన్ కిన్నెరసాని వన్యప్రాణి కేంద్రం గుండా వేసి అనుమతులు రాకుండా చేసింది  కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు.
  • కాంగ్రెస్ చేతకాని తనం వల్లే కరువు.
కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందని హరీశ్ రావు అన్నారు.అందుకే రైతులను ఆదుకునేందుకు గోదావరి జలాలే ఏకైక మార్గమని ముందుగానే గ్రహించిన కేసీఆర్  సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారన్నారు. ఈ పథకం ద్వారా రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్  ప్రాజెక్టుల్లో ప్రతిపాదించిన 3.33 లక్షల ఎకరాల ఆయకట్టతో పాటు, అదనంగా మరో 3.41 లక్షల ఎకరాలకు నీరందించి, నిల్వ సామర్థ్యాన్ని 1.2 టీఎంసీ నుంచి 10 టీఎంసీలకి పెంచి, 7,967 కోట్లతో పనులు ప్రారంభించారన్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తుంటే, రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.