ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షల సందర్భంగా పరీక్షల నిర్వహణపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే ప్రవీణ శుక్రవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని విశ్వ వికాస్ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో నిర్వహణ, పర్యవేక్షణ విధానాలను పరిశీలించి, విద్యార్థులు నియమాలను కచ్చితంగా పాటించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
డాక్టర్ ప్రవీణతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు, అలాగే సి. శ్యామ్ సుందర్ నేతృత్వంలోని సెట్టింగ్ స్క్వాడ్ కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.