- క్రైం మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ ఓపెన్ చేయలని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ సమర్థవంతమైన పోలీసు వ్యవస్థతోనే శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉంటాయని సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు.పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు రోజులలో కురిసే వర్షాల దృష్ట్యా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పర్చాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని అన్నారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందును అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి పకడ్బంది గా పని చేయాలని, గ్రామాలలో జరిగే శాంతి భద్రతల అంశాలను ముందస్తు సంచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన విగ్రహా తయారీ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండ చూడాలని, విగ్రహాలు తయారు చేసే క్రమంలో లేదా వాటిని తరలించే క్రమంలో జరిగే ప్రమాదాల గురించి తయారీదారులకు అవగాహన కల్పించాలని అదేవిధంగా సంబంధిత విద్యుత్ శాఖ వారితో సమావేశం చేసుకుంటూ ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ తెరవాలని ఆదేశించారు. అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ,అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వారే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో, డిఎస్పిలు వెంకటరమణ, రఘు చంధర్, రాములు, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్అలీఖాన్, రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇనస్పెక్టర్ లు కిరణ్ కుమార్, వేణు, సి.ఐ లు, సుధాకర్, కరుణాకర్, రామ్ నరసింహారెడ్డి, రవి, సురేష్ , ఎస్.ఐ లు, డిసిఆర్ బి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
