Take a fresh look at your lifestyle.

వైద్యునిపై దాడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు – కలెక్టర్ అభిలాష అభినవ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యునిపై గురువారం చోటుచేసుకున్న దాడి ఘటనను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి ఎవరూ తీసుకోవడానికి వీల్లేదని హెచ్చరించారు. అరాచకానికి పాల్పడే వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందన్నారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలో వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు యథావిధిగా పనిచేస్తున్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సాధారణ ఓపీ సేవలతో పాటు అత్యవసర వైద్య సేవలు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజాసేవకు భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, వైద్యులకు రక్షణ కల్పించడంతో పాటు శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.