బీబీనగర్, ముద్ర ప్రతినిధి: మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టు అక్రమమని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేష్ తీవ్రంగా ఖండించారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా ఉన్న ఒక దళితుడిని ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్య అని ఆయన గురువారం పేర్కొన్నారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమని, నిష్పక్షపాతం గా ఉండాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కాంగ్రెస్ నాయకుల కనుసైగలకు తలొగ్గి పని చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి సంకేతమన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయిందని, క్యాతనపల్లిలో ప్రజలు బీఆర్ఎస్ కు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, ఆ తీర్పును అపహాస్యం చేస్తూ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. వందలమంది పోలీసులను పెట్టి క్యాతనపల్లిలో మంత్రి వివేక్ చేస్తున్న అరాచకాలను, ఎన్నికల అక్రమాలను ప్రశ్నించినందుకు బాల్క సుమన్ ను అక్రమంగా అరెస్టు చేయడం దారుణ మన్నారు. బాల్క సుమన్ పాటు పార్టీ సీనియర్ నేతలను కార్యకర్తలను పోలీసులు వేధిం చడం ఆపాలని, లేకుంటే ఇప్పుడు అధికార పార్టీకి, మం త్రికి అడుగులకు మడుగు లొత్తుతూ అక్రమాలకు పాల్ప డుతున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ మార్కు కబ్జా రాజకీయం నడుస్తోందనిన్నారు.
పశువుల కంటే హీనంగా కొనుగోలు చేస్తూ, దొరకని వారిని పోలీసులతో కిడ్నాప్ చేయిస్తున్న తీరు అమానుషంగా ఉందన్నారు. బాల్క సుమన్, బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాల్క సుమన్ ను వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని జక్కి నగేష్ హెచ్చరించారు. అధికార పార్టీ మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసు అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు