హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 19:
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలు కులమతాలకు, ప్రాంతాలకు అతీతమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బాలానగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆయన గురువారం ఆవిష్కరించారు.
బాలానగర్‌కు చెందిన జై శ్రీరామ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి రమేష్, తొలుత శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో బండి రమేష్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఛత్రపతి శివాజీ చేసిన పోరాటం చూపిన ధైర్యం సాహసం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తర్వాతి కాలంలో జరిగిన అనేక ధర్మ పోరాటాలకు శివాజీ మహారాజ్ ఆశయాలే పునాదిగా నిలిచాయని గుర్తుచేశారు.
విగ్రహ ఆవిష్కరణ అనంతరం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, శివాజీ అభిమానులు పాల్గొన్నారు.