Take a fresh look at your lifestyle.

అప్పుడు చెల్లని రూపాయి ఇప్పుడెలా చెల్లుతుంది? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

 
జీవన్ రెడ్డి పార్టీ వీడటంపై హాట్ కామెంట్స్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

మాజీ మంత్రి జీవన్ రెడ్డిని గతంలో చెల్లని రూపాయి గా విమర్శించిన బిఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ ఇప్పుడు ఆయనను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారో చెప్పాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. అప్పుడు చెల్లని రూపాయి ఇప్పుడు ఎలా చెల్లుతుంది అంటూ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే పార్టీని వీడేవారేనా? అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. రాజ్య సభ ఇచ్చినా లేక ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చినా జీవన్ రెడ్డి పార్టీలోనే ఉండేవారని, పదవులు రాకపోవడంతోనే బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతున్నారని అన్నారు. 40 ఏళ్లు పార్టీలో పదవులు అనుభవించిన వ్యక్తి ప్రభుత్వంపై, సీఎంపై విమర్శలు చేస్తున్నారని, ఇది రాజకీయ నైతికత కాదన్నారు. ఇకనైనా జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. గతంలో కేసీఆర్, కేటీఆర్‌లను తీవ్రంగా విమర్శించిన జీవన్ రెడ్డి ఇప్పుడు వారినే ప్రశంసించడం విడ్డురంగా ఉందన్నారు. మరోవైపు జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభపై కూడా మంత్రి విమర్శలు చేశారు. ఇది నిజంగా బీఆర్ఎస్ బహిరంగ సభనా? లేక జీవన్ రెడ్డి చేరిక సభనా? అన్నది ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లు అక్రమ సంపాదనతో సభకు జన సమీకరణ చేస్తున్నారని విమర్శలు చేశారు. సభ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని హెచ్చరించారు. సీఎం రేవంత్ పాలనా పోవాలని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అదే నిజమైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు పట్టం కట్టారని, ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు విజయం సాధించిందని ప్రశ్నించారు. ఇక గత ప్రభుత్వం మాదిరి అక్రమ అరెస్టులు, నిర్భంధాలు లేవని, బీఆర్ఎస్ సభ విషయంలో నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఇవ్వాలని తానే స్వయంగా కలెక్టర్‌కు సూచించినట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటీ గమనిస్తున్నారని నిజమైన రాజకీయ నిబద్ధత, అభివృద్ధి, సంక్షేమం ఎక్కడుందో అర్థం చేసుకుంటారని అన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ నందయ్య, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.