కల్తీ లేని ఉత్తర తెలంగాణను నిర్మించాలి-అసెంబ్లీలో మీడియాతో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
ప్రభుత్వ పథకాలకు ఇందిరా గాంధీ పేరు పెట్టి అవమానిం పవద్దు
కౌలుదారులు వచ్చి కాంగ్రెస్‌ను నాశనం చేస్తున్నారు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కల్తీ లేని ఉత్తర తెలంగాణను నిర్మించాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
డిమాండ్ చేశారు. మద్యం బ్రాండ్లలాగే ఇప్పసారాకు పింక్ లేబుల్ వంటి పేర్లు పెట్టి ప్రభుత్వమే సరఫరా చేయాలని సూచించారు. గురువారం ఆసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఉత్తర తెలంగాణలో కల్తీ కల్లు మరణాలు, గల్ఫ్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వ పథకాలకు పెడుతున్న పేర్లపై దుమ్మెత్తిపోశారు. ఉత్తర తెలంగాణలో ఆల్‌ఫ్రాజోలం కల్తీ కల్లుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పథకానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు పెట్టడం ద్వారా ఆమెను అవమానించవద్దని రాకేష్ రెడ్డి హితవు పలికారు. సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న అభ్యంతరకర వీడియోలను ఖండించిన ఏకైక ఎమ్మెల్యేను తానేనని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలకు తెలంగాణ అమరవీరుల పేర్లు, మాజీ సీఎంల పేర్లు మీకు దొరకడం లేదా అని ప్రశ్నించారు. సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీఎం అయ్యారని చురకలంటించారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలను అవమానిస్తూ బయటకు పంపుతున్నారని మండిపడ్డారు. కౌలుదారులు వచ్చి కాంగ్రెస్‌ను నాశనం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్ష ఆరోపణలు చేశారు. జీవన్ రెడ్డి మాటలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన 120 మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదని, వారు సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో గల్ఫ్ సంక్షేమ నిధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.