- హెచ్ సియూలో 400 ఎకరాల భూములను ఎవరు కొనుక్కోవద్దు.
- కొనుగులు చేస్తే తీవ్రంగా నష్టపోతారు .
- హెచ్చరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఖచ్చితంగా తమ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరైనా ఆ భూములను కొనుక్కుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.అక్కడ అద్భుతమైన ఏకో పార్క్ ను నిర్మించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్ నగర ప్రజలకు బహుమతిగా అందిస్తామన్నారు.యూనివర్సిటీకి చెందిన భూములను కాపాడుకునేందుకు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి, వారి పోరాట స్ఫూర్తి కి పార్టీ తరఫున సెల్యూట్ చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలో జరిగిన పోరాటాలకు ధీటుగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ విరోచితంగా పోరాడుతున్నారు.పది రోజులుగా విద్యార్థులు పోరాడుతుంటే కనీసం వారితో చర్చలు జరపడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను గుంటనక్కలు,పేయిడ్ బ్యాచ్ అనడం ముఖ్యమంత్రి, మంత్రుల అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రాష్ట్రానికి నియంతో,బాసో కాదన్నారు.ఆయన ఒక పెద్దపాలేరు మాత్రమేనని అన్నారు.ఆయన కాదు మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా..ఎమ్మెల్సీలైనా..అందరూ ప్రజా సేవకులేనని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి అనువంతైనా లేదని మండిపడ్డారు..మేం పాలకులం..మీరందరూ మా కాలి కింద చెప్పులు.. బానిసలు.. అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు,.ప్రజల సొమ్ముకు ప్రభుత్వాలు ధర్మకర్తలు మాత్రమే అన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తా అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పది నిమిషాలు మనిషిలాగా ఆలోచించాలని సూచించారు.రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా రోజుకు 18 గంటలు పని చేయకుండా ఒక పది నిమిషాలు ఒక తండ్రి లాగా ఒక తాత లాగా భవిష్యత్ తరాల మీద సోయితో రేవంత్ ఆలోచించాలన్నారు.ప్రభుత్వ భూమి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు అర్ధరాత్రి దొంగలు లాగా అక్కడ పనులు ఎందుకు చేపిస్తున్నారన్నారు. పది రోజులు సమయం ఇవ్వండి అని కోర్టుకు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల్లాగా ఎందుకు అక్కడ చెట్లు కొట్టేస్తూ వన్యప్రాణులను చంపేస్తోందన్నారు.
కోర్టు సెలవులను చూసుకొని మరి సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నదన్నారు. శని, ఆదివారాలు ప్రజల మీదికి బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయని హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పిన ప్రభుత్వానికి బుద్ధి రాదా..ఇంగితం రాదా? అని ప్రశ్నించారు.ఫుట్ బాల్ ఆడడానికి సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమతో ఫుట్ బాల్ ఆడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారన్నారు. విద్యార్థుల జుట్టులాగడం, ఆడపిల్లల బట్టలు చింపడమే ప్రజా పాలన అని నిలదీశారు.. హైదరాబాద్ భవిష్యత్తు కోసం..ప్రజల కోసమే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కొట్లాడుతున్నారన్నారు.వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హెచ్ సియూలో చదువుకుంటున్న విద్యార్థులకు హైదరాబాద్ మీద ఉన్న ప్రేమలో ఇసుమంతైన రేవంత్ రెడ్డి కి ఉందా..?అని మండిపడ్డారు.అందరిని ఒప్పించి మా ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం 14వేల ఎకరాలను సేకరించామన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చి ఎన్నో జాతీయ,అంతర్జాతీయ అవార్డులను సాధించామని వివరించారు. కేసీఆర్ హయాంలో 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించామన్నారు.హైదరాబాదులో 7.7 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.పర్యావరణ పరిరక్షణలో,గ్రీన్ కవర్ ను పెంచడంలో తెలంగాణ దేశంలోని నెంబర్ వన్ గా నిలవడం బీఆర్ఎస్ సాధించిన రికార్డ్ అని తెలిపారు.పదేళ్లలో భారతదేశంలోని మెట్రో నగరాల్లో అత్యధికంగా పచ్చదనం పెరిగిన నగరమని హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదకను చెప్పిందన్నారు.దేశంలోని అత్యధికంగా గ్రీన్ కవర్ పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు.2021లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెరిగిందని భారత ప్రభుత్వం సైతం పార్లమెంట్లో సమాధానం ఇచ్చిందన్నారు.పల్లెల్లో 13657 ఎకరాల్లో 19472 ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు.హైదరాబాద్ చుట్టూ 108 అర్బన్ లంగ్ స్పేసెస్ ను ఏర్పాటు చేశామన్నారు. 270 కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణమన్నారు.పర్యావరణ పరిరక్షణ గురించి మాకు ఎవరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలను కబ్జా పెట్టాలనుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.