- అందాల పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
- దేశ విదేశాల నుంచి వచ్చే అందాల తారలు, అతిథుల బసకు పకడ్బందీ ఏర్పాటు.
- చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.
- మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సమీక్ష.
ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే నెల పదో తేది నుంచి జరగనున్న మిస్ వరల్డ్ -2025 పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ కేంద్రంగా జరగనున్న ఈ పోటీలకు నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిద్దాలని సూచించారు.నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ పోటీల ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు అందాల పోటీకి సంబంధించి చేసిన, చేస్తోన్న ఏర్పాట్ల వివరాలను సీఎంకు వివరించారు.ఈ సందర్భంగా సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది అందాల తారలు ఈ పోటీల్లో పాల్గొననున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేసే, వారితో పాటు వచ్చే విదేశి, స్వదేశీ అతిధులకు చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల గురించి వివరించాలని ప్రభుత్వం భావిస్తున్నది.తద్వారా రాష్ట్రానికి పర్యాటకంతో పాటు పెట్టుబడుల స్ధాపన కోసం ఆకర్శించాలని నిర్ణయం తీసుకున్నది.
