- అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి చాలా ప్రమాదం.
- అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది.
- ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్.
- బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తేవాలి.
- బీజేపీ డీఎన్ఏలోనే బీసీ, దళిత వ్యతిరేకత ఉంది.
- దళిత నేత, రాజస్థాన్ ప్రతిపక్ష నేత టికారాం జుల్లి శ్రీరామనవమి నాడు రాముడి గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారు.
- అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండడం దురదృష్టకరం.
- ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేయాలి.
- అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష.
ముద్ర, తెలంగాణ బ్యూరో: కంచా గచ్చిబౌలి భూముల విషయంలో చాలా ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫోటోలు రూపొందించారని ఆరోపిస్తూ కేసులు పెట్టడానికి ఉపక్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని,ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు..ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని విమర్శించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు..అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని ధ్వజమెత్తారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని,అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ అని, అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు ఇందిరా పార్కు వద్ద ఆమె దీక్ష చేశారు. తెలంగాణ జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా ఈ దీక్షా కార్యక్రమానికి వేలాది మంది బీసీలు, ప్రజలు తరలివచ్చారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష సాగుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.దళిత నేత, రాజస్థాన్ ప్రతిపక్ష నేత టి కారాం జుల్లి శ్రీరామనవమి నాడు రాముడి గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారని,అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండడం దురదృష్టకరమన్నారు.బీజేపీపాలిత రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేవి కేవలం మాటల్లోనే ఉన్నాయి చేతల్లో చూపించాలని సూచించారు.అయోధ్య రాముడి గుడి కడితే బీజేపీ ప్రభుత్వం గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా గౌరవం దక్కకపోతే పోరాటం తప్ప మనకు ఇతర మార్గమేముంది ? అని ప్రశ్నించారు. బాన్సువాడ ప్రాంతంలో ఒక చాయ్ దుకాణంలో రెండు గ్లాసుల పద్ధతి ఇంకా ఉండడం దారుణమని తెలిపారు.ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అనేక సందర్భాల్లో ఇప్పటికీ అవమానాలు జరుగుతున్నాయని, ఇవి సమాజానికి మంచిది కాదని, వీటిని రూపుమాపడానికి నడుంబిగించాలని పిలుపునిచ్చారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన రెండు బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.చట్టసభలు బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైందని, ఆ బిల్లులు గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా..లేదా రాష్ట్రపతికి పంపించారా ? అని అడిగారు.ఆ బిల్లులను ఆమోదించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారని, కానీ ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని చెప్పారు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్ మెంట్ లభించేదని, బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని విమర్శించారు.దానికి బదులు ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారని, ధర్నాకు రాహుల్ గాంధఈ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి ఆయన రాలేదని చెప్పారు.కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాము కూడా కలిసి వస్తామని, కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందామని స్పష్టం చేశారు. దేశంలో ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో 50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగిపోయిందని, కాబట్టి 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించినా కోర్టులు అడ్డుకోలేవని, ఈ రీత్యా బీసీ బిల్లుల ఆమోదానికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.బీసీలను మభ్యపెట్టవద్దు..రెండు బిల్లులను ఆమోదించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. బీజేపీ డీఎన్ఏ నే బీసీలకు, దళితులకు వ్యతిరేకమని ధ్వజమెత్తారు. అటువంటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలంటే ప్రజా ఉద్యమాలే మనకు మార్గమని అన్నారు.కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంటా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్ సైట్ లో పెట్టామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదు? అని ప్రశ్నించారు.2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదని, తెలంగాణలో చేసిన కుల గణన వివరాలను వెల్లడించలేదని ప్రస్తావించారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలని అన్నారు.కుల గణనపై అధ్యయనం పూర్తి చేసే వరకు మనం మాట్లాడ వద్దని స్వతంత్ర అధ్యయన కమిటి హెచ్చరించిందని, మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి అని నిలదీశారు. చిత్తశద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు.
కాగా ఈ నెల 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంక్షించిన వ్యక్తి పూలే అని కొనియాడారు.పూలే తనకు గురువు అని అంబేద్కర్ చెప్పారని, మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పూలేని కీర్తించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేశారని చెప్పారు.అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్పూర్తి పొందుతుందని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాహిత్య అకాడెమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బిఆర్ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, మాజీ బీసీ కమిషన్ మెంబెర్ కిషోర్ గౌడ్, టీఎస్పీఎస్సీ మాజీ మెంబెర్ సుమిత్ర తనోబా, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జై సింహ, నివేదిత సాయన్న, ఆశిష్ యాదవ్, కార్పొరేటర్లు సామాల హేమ, సునీత, సరస్వతి ఆలకుంట హరి, లలిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.