- జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : రానున్న వేసవిలో తాగు, సాగు నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించి పక్కాగా చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగునీరు, త్రాగునీరు, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రబీ సీజన్ కు సాగునీటి సరఫరా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. వచ్చే వేసవికాలం దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా కార్యచరణ రూపొందించి నిరంతరం నీటిని అందించే విధంగా ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలని తెలిపారు. రబీ సీజన్ కొరకు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ సాగులో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో యూరియా కొరత లేకుండా చూడాలని తెలిపారు.
వేసవికాలంలో వ్యవసాయానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎంసీహెచ్ ఆర్డీ నుండి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, పంచాయతీ అధికారి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి, వ్యవసాయ శాఖ అధికారి, నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.