Take a fresh look at your lifestyle.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రే కేంద్ర బడ్జెట్‌ : భట్టి విక్రమార్క

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే కుట్ర
అందుకే బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యి
నిధుల కొసం ఎన్నోసార్లు పీఎం, కేంద్రమంత్రులను కలిశాం
ఒక్క విన్నపాన్నీ పరిగణలోకి తీసుకోలేదు
కేంద్రం 2047 లక్ష్య సాధనలో భాగస్వాములం కాలేం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముద్ర, తెలంగాణ బ్యూరో :

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తామంతా ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ, ఒక్క విన్నపాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయ్యి చూపడానికి కారణమేంటనీ ప్రశ్నించారు. తెలంగాణ ఏం తప్పు చేసిందంటూ నిలదీశారు. ఆదివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, , మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల కోసం కేంద్రం నుండి భారీగా నిధులు అందుతాయని ఆశించామన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం కేంద్ర సాయం కోరినప్పటికీ బడ్జెట్‌లో దాని ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రపంచానికే ఫార్మా హబ్‌గా ఉన్నప్పటికీ, కేంద్రం ప్రకటించిన కెమికల్ పార్కుల జాబితాలో తెలంగాణకు చోటు కల్పించకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఈసీఐఎల్ వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌కు తెచ్చామన్న ఆయన ప్రస్తుత ప్రభుత్వం ఉన్నవాటిని కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. కేంద్రం ఈ విభాగంలోనూ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని భట్టి విమర్శించారు. అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ గురించి విజన్ డాక్యుమెంట్‌లో తెలంగాణ గురించి ప్రముఖంగా చెప్పినా, బడ్జెట్ కేటాయింపుల్లో అది ఎక్కడా కనిపించలేదన్నారు. హైదరాబాద్ సెంట్రిక్‌గా ఉండాల్సిన ‘ఆరెంజ్ ఎకానమీ’ని కూడా బాంబేకి తరలించడం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. రామప్ప వంటి ప్రపంచ వారసత్వ కట్టడాలు, కృష్ణా-గోదావరి నదుల తీరంలో అద్భుతమైన దేవాలయాలు, అటవీ సంపద ఉన్నా తెలంగాణ టూరిజాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించిందని భట్టి ఆరోపించారు. రీజినల్ మెడికల్ హబ్ ప్రకటించినా అందులో తెలంగాణ పేరు లేదని, సెమీ కండక్టర్ల విషయంలో కేవలం ‘పరిశీలిస్తాం’ అన్న మాటే తప్ప స్పష్టమైన ప్రకటన లేదని మండిపడ్డారు. కేంద్రం 2047 లక్ష్య సాధనలో తాము కూడా భాగస్వామ్యం కావాలని అనుకున్నామన్నారు. కానీ కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేయడంతో అది సాధ్యం కాదని ఆయన అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జాబితా నుండి తొలగించే ప్రయత్నం చేస్తూ, పేదల సంక్షేమానికి కేంద్రం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని భట్టి పిలుపునిచ్చారు. తాము బాధ్యతగా కేంద్రాన్ని కలుస్తూనే ఉంటామన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.