సీఎం రేవంత్ కు గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ విజ్ఞప్తి
ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్‌లో మూసీ నది ఒడ్డున తెలంగాణ సర్కార్ నిర్మించదలచిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు.. అక్కడ ఉన్న ఇళ్లను కూలగొట్టడాన్ని ఆయన ఖండించారు. వెంటనే ఇళ్లను కూల్చడాన్ని ఆపేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా సీఎంను అభ్యర్ధించారు. ఒక వేళ గాంధీ బతికి ఉంటే.. ఇలా చేయొద్దని చెప్పేవారని తుషార్ వెల్లడించారు. గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం.. అక్కడ ఉన్న ఇళ్లను కూల్చేసి.. స్థానికులను వారి ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం సరైందని కాదన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు. ఒకవేళ గాంధీజీ బతికి ఉంటే తన పేరు మీద, తన విగ్రహ నిర్మాణం కోసం ఇలాంటివి చేయొద్దని చెప్పేవారని వెల్లడించారు. అందుకే ఈ గాంధీ విగ్రహ ఏర్పాటును వెంటనే ఆపాలని తుషార్ గాంధీ తెలిపారు. విగ్రహాల ఏర్పాటు కంటే పేద ప్రజల కనీస అవసరాలే తనకు ముఖ్యమని గాంధీజీ నమ్మేవారని ఈ సందర్భంగా తుషార్ పేర్కొన్నారు. అలాంటిది ఆయన విగ్రహాన్ని పెట్టడం కోసం పేదల ఇళ్లను తొలగించడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని తెలిపారు. ఇదీలావుంటే.. మూసీ సుందరీకరణ పేరుతో.. నది ఒడ్డున గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. హిమాయత్ సాగర్ నుంచి ప్రారంభమైన మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 24 వేల ఎకరాలను సేకరించాలని ప్రణాళికలు వేసింది. రూ.1.5 లక్షల కోట్లతో చేపట్టనున్న మూసీ సుందరీకరణ కోసం 1.5 లక్షలకు పైగా కుటుంబాలను అక్కడి నుంచి తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. అయితే మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా కేవలం 3200 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని.. 10 వేల నిర్మాణాలే ప్రభావితం అవుతాయని గతేడాది డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో సర్కార్ పేర్కొంది.