Take a fresh look at your lifestyle.

సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి నివాళి

సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా
సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం
ఆమె తెగువ, నిబద్ధత స్పూర్తిదాయకం
సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి నివాళి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి చనిపోయిన నిజామాబాద్ కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్య లేని లోటు భర్తీ చేయలేనిదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సౌమ్య సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకూ వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక్కరోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, తమ సహచరిని కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయం అని అన్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని చెప్పారు,. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్ను వణికించేలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం తమ ప్రభుత్వ పరిశీలనలో ఉందన్న ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి రెండు నిముషాల మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేషి, ఎక్సైజ్ శాఖ అధికారుల సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెందిన సౌమ్య, జనవరి 23న మాధవనగర్ వద్ద గంజాయి తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో స్మగ్లర్ల కారు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె శనివారం రాత్రి 9:41 గంటలకు తుదిశ్వాస విడిచారు. విధి నిర్వాహణలో విరోచితంగా వ్యవహరించిన సౌమ్య మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్మగ్లర్ల దౌర్జన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను వదిలిపెట్టవద్దని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. గాజుల సౌమ్య (23) భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన ధైర్యసాహసాలను కొనియాడిన సీఎం, ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. కాగా సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

సెల్యూట్.. సౌమ్య : నగర సీపీ సజ్జనార్
తన ప్రాణాలను పణంగా పెట్టి… స్మగ్లర్ల చేతిలో గాయపడి చికిత్సపొందుతూ గాజుల సౌమ్య మృతి చెందడం బాధాకరమని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్తు రక్కసిని అంతం చేసేందుకు ఆమె చూపిన సాహసం వెలకట్టలేనిదని కొనియాడారు. రక్తమోడుతున్నా వెనకడుగు వేయకుండా పోరాడిన ఆమె త్యాగం నిరుపమానమని చెప్పారు. గంజాయి మాఫియా వాహనంతో తొక్కించి కిరాతకంగా చంపడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, సమాజ రక్షణ కో సం ప్రాణాలర్పించిన ఆ వీరనారి ధైర్యానికి మనస్ఫూర్తిగా నివాళులర్పించారు. ఈ ఘటన కేవలం ఒక విషాదం మాత్రమే కాదన్న సజ్జనార్… గంజాయి మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో చెప్పడానికి నిదర్శనమని పేర్కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల ముప్పు సమాజానికి ఎంతటి ప్రమాదకరంగా మారిందో సౌమ్య మరణం హెచ్చరిస్తోందని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో అమరురులైన సౌమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.