ముద్ర : మల్కాజిగిరి
శ్రీరామ నవమి సందర్భంగా మల్కాజిగిరి, కాప్రా, నాచారం, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పూలతో, విద్యుత్ దీపాలతో ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయ పద్ధతిలో కళ్యాణ వేడుకలు నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాప్రా, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాలలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాముల అన్యోన్యత, రామలక్ష్మణుల సోదరా భావం అందరూ ఆచరించాలన్నారు. నేరేడ్మి ట్ శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా ఆలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ఆలయ ముఖ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఆలయ పరిసరాలు “జై శ్రీరాం” నినాదాలతో మార్మోగాయి.
కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, వేలాది మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.