ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్: జిల్లాలో మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన అలంకరణల తొలగింపుపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెకరేషన్లను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు.
బస్టాండ్ సమీపంలోని రామాలయం కమాన్ వద్ద ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్ స్ట్రీట్ లైట్స్‌పై ఏర్పాటు చేసిన కోల్డ్ ఫైర్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటూ వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు.
అయితే, ఈ చర్యలను బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న వారు అలంకరణలు తొలగించకుండా అడ్డుకోవడంతో అధికారులు మరియు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశముండడంతో పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.