Take a fresh look at your lifestyle.

రైతు శ్రేయస్సే రాష్ట్ర ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

 

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు

ధాన్యం తరలింపులో సమన్వయంతో పనిచేయాలి

కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు తప్పనిసరి
సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

రైతు కష్టానికి తగిన గౌరవం దక్కేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రైతు కేంద్రంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రైతులు, కొనుగోలు దారులు, రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఎవరూ ఎవరినీ బతిమాలుకునే పరిస్థితి రాకుండా జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేలా సమిష్టిగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సుఖ జీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో రబీ 2025–26 సీజన్‌కు సంబంధించిన వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ఏర్పాట్లపై జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు, డీసీఓలు, సీఈఓలు, డీఆర్‌డీఓలు, ఏపీఎంలు, మండల వ్యవసాయ అధికారులు, సివిల్ సప్లైస్, మార్కెటింగ్, రవాణా, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు, లారీ కాంట్రాక్టర్లు, ఏఎంసీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

రైతులకు అన్యాయం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి, వరి కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, రవాణా కాంట్రాక్టర్లు సమయానికి లారీలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వ్యవసాయ అధికారులు క్లస్టర్ స్థాయిలో పంటల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి ముందస్తుగా నివేదికలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. రైతుల పంటల వివరాలు ముందుగానే అందుబాటులో ఉంటే కొనుగోలు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు సకాలంలో చేయడం సులభమవుతుందని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 1,87,418 ఎకరాల్లో సాగు జరగగా, దాదాపు లక్షా 20 వేల మంది రైతుల నుంచి 4 లక్షల 44 వేల 33 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు. రైతులు తమ పంటకు న్యాయమైన ధర పొందేలా ప్రభుత్వం చేపట్టిన కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు ప్రక్రియలు సజావుగా జరిగేలా ప్రతి మండలానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, సమస్యలు తలెత్తిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు, జాప్యాలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి రాకూడదని, వెంటనే తూకం వేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన తాగునీరు, షెడ్లు, గన్నీ బ్యాగులు, హమాలీలు, తూకం యంత్రాలు, రవాణా వాహనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయరాదని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఎక్కడైనా సమస్యలను ఎదుర్కొంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం అవసరమైన గోదాములు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఈ సీజన్‌లో 3 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, అందుకు అనుగుణంగా మూడు లక్షల గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని అధికారులను కోరారు. మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పొద్దుతిరుగుడు పంట దిగుబడి అధికంగా ఉందని, ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అంతకుముందు అధికారులు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వివరాలు, ధాన్యం నిల్వ సామర్థ్యం, గన్నీ బ్యాగుల సరఫరా, రవాణా సదుపాయాలపై ప్రజాప్రతినిధులకు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.