Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి…. పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర…

 

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని పూడూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ రైతులతో నేరుగా మాట్లాడారు. ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తూకంలో తేడాలు లేకుండా చూడాలని, రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని ధాన్యం కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా మరియు రైతులకు అన్ని రకాల అవగాహనాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యం జరగకుండా ఉండేందుకు మిల్ ట్యాగింగ్ (Mill Tagging) ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలోని నూకపెల్లి గుణ గంగన్ రైస్ మిల్లును సందర్శించి, అక్కడ ధాన్యం నిల్వ సామర్థ్యం, మిల్లింగ్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ‘కస్టమ్ మిల్లింగ్ రైస్’ (CMR) అప్పగించాలని మిల్లర్లకు సూచించారు. జిల్లా యంత్రాంగం,  పౌర సరఫరాల అధికారులు సమన్వయంతో పనిచేసి, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా తేమ శాతం విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.