Take a fresh look at your lifestyle.

ఫీజు రీయింబర్స్ మెంట్ జాప్యానికి వివరణ ఇవ్వండి – ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

 
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో ఇబ్బందులు పెట్టొద్దు
ప్రైవేట్ కాలేజీల తీరుపై హైకోర్టు సీరియస్
సమస్య పరిష్కారం కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయండి

ముద్ర,తెలంగాణ బ్యూరో :

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్న ప్రైవేటు కాలేజీల తీరుపై హైకోర్టుతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు రాలేదన్న కారణంతో విద్యార్థులను వేధించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు.. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పలు విద్యార్థి సంఘాలు పిటీషన్ దాఖలు చేశాయి. శుక్రవారం వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు సర్కారు నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎన్ని..? వాటిని ఎప్పుడు చెల్లిస్తారు అనే అంశాలపై రెండు వారాల్లో పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ప్రభుత్వాన్నిఆదేశించింది. ఫీజు బకాయిల కోసం విద్యార్థుల సర్టిఫికెట్లను తాకట్టు పెట్టుకునే హక్కు ఏ విద్యా సంస్థకూ లేదని కోర్టు తేల్చి చెప్పారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కాలేజీల వేధింపులకు గురవుతున్న విద్యార్థులు తమ ఫిర్యాదులను చెప్పుకునేందుకు, తక్షణ పరిష్కారం కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.