ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీసుల పటిష్ట పోలిసింగ్, నిరంతర నిఘా కారణంగా చైన్ స్నాచింగ్‌లు, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఆలయాల్లో చోరీలు వంటి నేరాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా తగ్గాయి. నేరస్థులను పట్టుకోవడంలో ప్రత్యేక వ్యూహంతో నిరంతర నిఘా ఫలితంగా నేరస్థులను కట్టడి చేసారు. నేరాల తగ్గుదల పై సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి పలు వివరాలు వెళ్లడించారు. సైబరాబాద్ పరిధిలో వాహనాల అపహరణ జరిగిన వెంటనే కేసులు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ పాత నేరస్తులపై నిఘా ఉంచి వారి కదలికలను గుర్తించి వెంటనే అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను చాకచక్యంగా అరెస్ట్ చేస్తున్నారు.

మచ్చుకు కొన్ని కేసులు:
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో అరెస్ట్. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 కేజీల వెండి దొంగిలించిన అంతర్రాష్ట్ర ముఠాను రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకుని, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన ఢిల్లీకి చెందిన ముఠాను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అరెస్ట్.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖజానా జ్యువెలరీస్ దోపిడీ కేసులో పూణే (మహారాష్ట్ర), ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో గాలించి నిందితులను అదుపులోకి తీసుకోవడం. జీడిమెట్లలో జరిగిన ఏటీఎం దొంగతనానికి సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠాను హర్యానాలోని మేవాడ్ ప్రాంతంలో అరెస్ట్ చేయడం వంటివి.
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో జరిగిన చోరీ కేసులోనూ అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి దేవాలయానికి చెందిన సొత్తును రికవరీ, అంతర్రాష్ట్ర దొంగలను ఎక్కడ దాక్కున్నా వారిని గుర్తించి అరెస్ట్ చేయడమే సైబరాబాద్ పోలీసుల పనితీరుకు నిదర్శనమని డీసీపీ ఇప్పటికే మీడియా కు తెలిపారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ధన–మాన–ఆస్తి రక్షణకు సైబరాబాద్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని, ఏవైనా అనుమానస్పద కదలికలు ఉంటే వెంటనే డయల్ 100, 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని డీసీపీ ముత్యంరెడ్డి సూచించారు.
