Take a fresh look at your lifestyle.

కేసీఆర్ కు నోటీసులు దుర్మార్గపు చర్య -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 
విచారణ పేరిట ప్రతీకారం
అసమర్థ కాంగ్రెస్ కు ప్రజలే బుద్ది చెబుతారు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని చెప్పారు. ప్రత్యేక ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అడ్డగోలు హామీలు… అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విచారణల పేరుతో డైవర్ఫన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు చెబుతున్నట్లు ఫోన్ ట్యాపింగ్ పేరిట జరుగుతున్నది విచారణ కాదన్నారు. ఇది ముమ్మాటికీ అధికార పార్టీ ప్రతీకార చర్య అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామన్న కేటీఆర్…. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు.. ప్రజల తీర్పుతోనే రాస్తారనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గ్రహించాలన్నారు. తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ అన్నారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ అని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.