Take a fresh look at your lifestyle.

స్కూళల్లో అల్పాహారం, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం జూన్ రెండు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రతి ఒక్కరికీ చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు
విద్యతోనే అంతరాలు లేని, ఆదర్శ సమాజ నిర్మాణం
ముద్ర, ఖమ్మం :
వచ్చే విద్యాసంవత్సరంలో స్కూళల్లో అల్పాహారం, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకాలను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ అర్ధాకలితో బడికి పోకూడదన్నారు.

అర్ధాకలితో బడికి పోయిన విద్యార్థి సరిగా పాఠాలను అర్థం చేసుకోలేడన్న ఆయన చదువుపై ఏకాగ్రత చూపలేడని చెప్పారు. ఇదే ఉద్దేశ్యంతో ఈ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. , జూన్ రెండో తేది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 20 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం, ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. విద్యార్థులకు రాష్ట్ర భవిష్యత్తు, వారి ఎదుగుదలే రాష్ట్ర సంపూర్ణ ఎదుగుదల గా భావించి బడ్జెట్లో విద్యాశాఖకు 13.5 శాతం నిధులు కేటాయించినట్లు వివరించారు.

గత పదేండ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ నేతలు సమృద్ధిగా ఉన్న రాష్ట్ర వనరులను దేనికోసం ఖర్చు పెట్టాలో తెలియక వెచ్చించలేదన్నారు. దీంతో రాష్ట్రం దోపిడీకి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క… బోనకల్లు,, ఎర్రుపాలెం మండల కేంద్రాల్లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఇంటర్ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ద్వారా కూడా స్పష్టమైందన్నారు. అక్షరమే ఆయుధంగా మలుచుకొని తెలంగాణ బిడ్డలు చదువుకొని బాగా ఎదగాలన్నారు. ఏ ఆయుధం తెలంగాణ బిడ్డలను నిలబెట్టలేదని చెప్పారు.

అక్షరం ద్వారానే సమ సమాజం, అంతరాలు లేని ఆదర్శ సమాజం విద్య ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతుంది ఈ పెట్టుబడి ఏది వృధా కాకూడదని ఆయన కోరారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతిబిడ్డ తాను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు సౌకర్యాలు కల్పించాలని, అద్భుతమైన మానవ వనరులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దాలని విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి వారికి కావలసిన సౌకర్యాలు అన్ని కల్పిద్దామని తనతో స్పష్టం చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి ఆర్థిక వసతులు లేక, తల్లిదండ్రులు సహాయం చేయక చదువుకోలేకపోయాం అనే బాధ రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డకు ఉండొద్దు కార్పొరేట్ వసతులతో కూడిన విద్యను రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

అందరికీ నాణ్యమైన విద్య..

రాష్ట్రంలో పుట్టిన బిడ్డలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విద్యను బోధించేందుకు రాష్ట్రంలో ఒకేసారి 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ప్రారంభించామని భట్టి తెలిపారు. ప్రతి పాఠశాలను 100 కోట్ల పెట్టుబడితో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం అన్నారు. ఇంగ్లీష్ మీడియం లో బోధన, క్రీడా సౌకర్యాలు, డిజిటల్ బోధన పరికరాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అక్కడే ఉండేలా క్వార్టర్లు సైతం నిర్మిస్తున్నామని వివరించారు. అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకొని ఒక వసుదైక కుటుంబ భావన ఏర్పాటు చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకొని సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు.

 


యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తోపాటు రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. మొత్తం 119 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మిస్తున్నాం, సెమీ రెసిడెన్షియల్ విధానంలో ఈ పాఠశాలలు కొనసాగుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుని వచ్చిన సంపాదనతో గ్రామానికి వచ్చే ప్రైవేటు పాఠశాల బస్సులో తమ పిల్లలను రెడీ చేసి పంపుతున్నారన్నారు. అలాంటి వారికి చేయూతను ఇచ్చేందుకు పబ్లిక్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వాహనాలు ఉదయాన్నే గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొని వస్తాయనీ విద్యార్థులు రాగానే వారికి అల్పాహారం ఉచితంగా అందిస్తామన్నారు. మధ్యలో వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులు పాటు రాగి జావా వంటి పోషక పదార్థాలు అందిస్తామని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం విద్యాబుద్ధులు నేర్పడం, సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులను వారి ఇళ్ల వద్ద ఉచిత రవాణా సౌకర్యంతో దించి వస్తాయి అని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో నాణ్యమైన పోషక ఆహారంతో పాటు, క్రీడా సౌకర్యాలు, కంప్యూటర్, డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల కంటే ఉన్నతంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉండబోతున్నాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు పేద, మధ్యతరగతి వర్గాలు ఫీజుల పేరిట చేసే ఖర్చును ఆదా చేసి ఆయా కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పరచడంతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.పిల్లలు బాగా చదువుకునేందుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తనకు తెలిసిన మిత్రులతో మాట్లాడి అమ్మ ఫౌండేషన్ ద్వారా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.