Take a fresh look at your lifestyle.

అన్ని వర్గాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి  -హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్

అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు
దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రాధాన్యత 
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానంగా దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ లో మంత్రి సమత కిచెన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్థిక పునరావాస పథకం కింద ఆరు మంది ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులకు రూ. 75 వేల చొప్పున  ఆర్థిక సహాయం చెక్కులలను అలాగే  ఐదు మంది  దివ్యాంగులకు రూ. 1,18,500 విలువగల  బ్యాటరీ ఆధారిత  వీల్‌చైర్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా అభివర్ణించారు.
సమతా కిచెన్ ద్వారా దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఇతర అట్టడుగు వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. సమాజంలోని  వృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ లను ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి ఆర్థిక తోడ్పాటు అందించి సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. సమతా కిచెన్ లో ఆరు మంది ట్రాన్స్ జెండర్స్, ఒక దివ్యాంగుడికి ఉపాధి కల్పించడం హర్ణణీయమన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 10.47 లక్షల దివ్యాంగులు, 10 లక్షల మంది వృద్ధులు ఉన్నారన్నారు. అందులో హైదరాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల మంది వృద్ధులు నివసిస్తున్నారని తెలిపారు.  వీరికి 50 వేలకు పైగా సదరం సర్టిఫికెట్లు, 5 వేల యుడిఐడి కార్డులు జారీ చేశామన్నారు. 29 ,902 మంది దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 404 మంది ట్రాన్స్‌జెండర్‌లకు గుర్తింపు పత్రాలు జారీ చేశామన్నారు.

రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్లు సమాజంలో అంతర్భాగమనీ వారి సామాజిక స్వీకరణ, గౌరవప్రద జీవనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమత కిచెన్ కు ఎంపీ ల్యాడ్స్ నిధులను తన వంతుగా సహకారం అందిస్తానని తెలిపారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్లకు పెరుగుతున్న అవకాశాలపై సంతోషం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ఉపాధి కల్పన వంటి చర్యలు సమాజ మార్పుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో వారికి రాజకీయ మరియు పరిపాలనా వ్యవస్థలో మరింత ప్రాతినిధ్యం అవసరమని అభిప్రాయపడ్డారు.
జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ నిరంతర సహాయక చర్యలతో పాటు, సమతా కిచెన్ వంటి ఉపాధి ఆధారిత కార్యక్రమాల ద్వారా స్థిరమైన జీవనోపాధిని కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులు,  ట్రాన్స్‌జెండర్లకు వారి ఆసక్తులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యం అని  వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) జితేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, జిల్లా దివ్యాంగులు, వృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అధికారి రాజేందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అశన్న, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ప్రవీణ్, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఇలియా అహ్మద్,  , జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పవన్ కుమార్, ఏవో విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.