Take a fresh look at your lifestyle.

పోలీసులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్

  • బాధితులకు న్యాయం చేస్తాం
  • మారణాయుధాలు వాడిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు?

ముద్ర, తెలంగాణ బ్యూరో : బాధితులకు పూర్తిగా న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భరోసా ఇచ్చారు. బుధవారం నాడు రంగారెడ్డి జిల్లా కోహెడలో ఆయన పర్యటించారు.ఓ భూమి విషయంలో మారణాయుధాలతో దాడి చేసిన ఘటన గురించి ఆయన తెలుసుకున్నారు. వివాదాస్పద భూమిలో మారణాయుధాలను చూసి ఆయన అవాక్కయ్యారు. ప్లాటు యజమానులపై మారణాయుధాలతో దాడి చేస్తే, హత్యాయత్నం కేసు పెట్టకపోవడంపై హయత్నగర్ సీఐ నాగరాజు పై సీరియస్ అయ్యారు. మీరు కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందని సీఐని ప్రశ్నించారు.బాధితుల పట్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కోహెడ గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 951, 952లో ప్లాట్స్ ఓనర్స్, ఆ భూమి కొనుగోలు చేసిన సంరెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఇక్కడ వెంచర్ కు సంబంధించిన రోడ్డును కబ్జా చేసి ఫాం హౌజ్ నిర్మిస్తున్నారని గత ఫిబ్రవరిలో వచ్చిన ఫిర్యాదుతో ఫార్మ్ హౌజ్ ను హైడ్రా కూల్చివేసింది. కూల్చివేతలతో హైకోర్టు నుండి నాట్ టూ ఇంటర్ఫియర్‌తో పాటు ఇంజక్షన్ ఆర్డర్‌ను ఫాం హౌజ్ ఓనర్ బాల్ రెడ్డి తెచ్చుకున్నారు. గత రెండు నెలల క్రితం మార్చి 28న ప్లాట్స్ ఓనర్స్ కు అనుకూలంగా రంగారెడ్డి జిల్లా కోర్టు డిక్రీ ఇచ్చింది. ఈ నెల 1న ప్లాట్స్ క్లీన్ చేసుకుంటున్న సమయంలో బాల్ రెడ్డి వర్గీయులు ప్లాట్స్ ఓనర్స్ మధ్య ఘర్షణ జరిగింది.ఈ గొడవలో ప్లాట్స్ ఓనర్స్ పై గొడ్డలి, కత్తులతో దాడికి బాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు దిగారు.ఈ ఘటనపై బాధితులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేస్తే, సాధారణ గొడవ కింద ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.