- ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడుతున్నాం
- ఉద్యోగాల భర్తీ చేస్తున్నది మేమే
- గత మార్చిలో 15,623 మెగావాట్ల ఫీక్ డిమాండ్‌ను తట్టుకుని విద్యుత్ సరఫరా చేశాం
- పరిశ్రమల ఏర్పాటును పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ కోసం 31,809 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్లాన్
- రైతుల ఉచిత విద్యుత్‌కు పది వేల కోట్లు
- గృహ జ్యోతి కోసం రూ. 1485 కోట్లు ఖర్చు
- విద్యుత్ శాఖ ఉద్యోగులకు పెండింగ్ డీఏ విడుదల
- విద్యుత్‌శాఖలో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు నియామక పత్రాలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళుగా మోసాలకు పాల్పడుతూ, ప్రజలు భ్రమలను కల్పించిందన్నారు. ఇప్పుడు మళ్లీ అవే అబద్దాలతో ప్రజా ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసిందని, ఆ పరిస్థితి నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే స్థితిలోకి నెట్టివేస్తే, ఒకటవ తేదీన జీతాలు ఇచ్చే స్థితికి ఈ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాది లోపు 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లో 92 మంది అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ గా, తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థలో 20 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను భట్టి విక్రమార్క అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు.
2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ కొరకు 22 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిదని చెప్పారు. ఎన్నికల ముందు రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా గత పాలకులు ఎగ్గొడితే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఒకే రోజు 7624 కోట్ల రూపాయలను జమ చేసిందన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా ఇస్తున్నామని అన్నారు. 8400 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం వెచ్చించడానికి ప్రాథమిక అంచనా వేసి ఈనెల 26 నుంచి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేయబోతున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఈనెల 26 తర్వాత మొదటి విడత ఇన్ స్టాల్ మెంట్ డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా ఆలోచించి 40 శాతం డైట్ చార్జీలు పెంచడంతో పాటు 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్ళి 46 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చారన్నారు. విద్యుత్ శాఖ ముందు ఉన్న సవాళ్ళను అధిగమించి నిరంతరం నాణ్యత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.
మార్చి 8న 15,623 మెగావాట్ల పిక్ డిమాండ్ ను తట్టుకొని విద్యుత్ సరఫరా చేసిన శక్తి తెలంగాణ విద్యుత్ శాఖకు ఉందని చాటి చెప్పామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసి, కొత్తగా రానున్న పరిశ్రమల ఏర్పాటుకు పెరుగనున్న విద్యుత్ డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని 2029 30 నాటికి 22,448 మెగావాట్లు, 2034 -35 నాటికి 31,809 మెగావాట్ల డిమాండ్ విద్యుత్ సరఫరా చేయడానికి కసరత్తు చేపట్టామని భట్టి విక్రమార్క వెల్లడించారు. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చి 2035 సంవత్సరం నాటికి రాష్ట్రంలో 40 వేల మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతున్నదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 28 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు ఉచితంగా విద్యుత్తును అందజేస్తున్నామని అన్నారు. వ్యవసాయ పంపుసెట్ల ద్వారా రైతులకు అందిస్తున్న ఉచిత కరెంటుకు సంబంధించి 8729 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి రైతుల పక్షాన డిస్కములకు చెల్లిస్తుందన ఆయన తెలిపారు. గత మార్చి ఒకటి నుంచి అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 148.5 కోట్లు, ఇప్పటివరకు విద్యుత్ శాఖకు 1485 కోట్ల రూపాయలను చెల్లించింది. రాష్ట్రంలో 25 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ గ్రామాలుగా మార్చబోతున్నామని తెలిపారు. వ్యవసాయ పంపు సెట్లకు, గృహాలకు రూప్ టాప్ సోలార్ ఏర్పాటు చేయబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. .