ఈసారి పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి నగదు బదిలీ కీలకం
పింఛన్లపై మొదలైన కసరత్తు
పెంపునకు మార్గదర్శకాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో:
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ కసరత్తు చేస్తోంది. ఈ సారి రెండు కీలక పథకాలకు భారీగా నిధులు కేటాయించిన అవసరం కనిపిస్తోంది. తెలంగాణలో బడ్జెట్ నగారా మోగనుంది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ సర్కార్ దాదాపు రూ. 3.25 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి, ఈ దఫా బడ్జెట్ ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారనుంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలలో మిగిలిపోయిన కీలక హామీలకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తారనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
కీలకమైన హామీలు ఇంకా పెండింగ్‌లోనే!
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అమలు చేస్తోంది. అయితే, మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే మహాలక్ష్మి నగదు బదిలీ, వృద్ధాప్య పింఛన్ల పెంపు రూ. 4000 వంటి భారీ ఖర్చుతో కూడిన పథకాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికి తోడు రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేల పంపిణీకి అవసరమైన వేల కోట్ల నిధుల సమీకరణ ఆర్థిక శాఖకు సవాల్‌గా మారింది. ఆదాయ వనరులు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో, సంక్షేమ పథకాల భారాన్ని మోయడం ఖజానాకు తలకు మించిన భారమే అవుతోంది.
పథకాల అమలుకు అప్పులపైనే ఎక్కువగా ఆధారం!
రాష్ట్ర ఆదాయం ప్రధానంగా జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తున్నప్పటికీ.. హామీల అమలుకు అవసరమైన అదనపు నిధుల కోసం ప్రభుత్వం అప్పులపైనే ఎక్కువగా ఆధారపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీ ఖర్చులు, జీతాలు, పాత అప్పుల వడ్డీలకే పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ కొత్తగా బహిరంగ మార్కెట్ నుండి రూ. 60 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఒక రకంగా అప్పులతోనే అభివృద్ధి అన్నట్లుగా మారుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేకుండా పోయింది.
హామీలపై ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తున్నబీఆర్ఎస్
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. అధికారంలోకి వచ్చి రెండు బడ్జెట్లు గడిచినా 95 శాతం హామీలు అమలు కాలేదు అంటూ కేటీఆర్ బహిరంగ లేఖలు రాస్తున్నారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయంపై ఈ బడ్జెట్‌లో స్పష్టమైన కేటాయింపులు లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, ఈసారి బడ్జెట్‌లో సామాజిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూనే, నిధుల కొరత లేకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వం భావిస్తోంది.
పన్నులభారం వేయలేరు.. హామీలను ఆపలేరు!
ఈ 2026 బడ్జెట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేయనుంది. ఆదాయాన్ని పెంచుకునే కొత్త మార్గాలను అన్వేషిస్తారా లేక కేవలం అప్పులతోనే గ్యారెంటీలను నెట్టుకొస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా, హామీల అమలు కోసం సామాన్యులపై కొత్త పన్నుల భారం పడకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం అటు పన్నుల భారం వేయలేదు.. ఇటు సంక్షేమ పథకాలు, అభివృద్ధిపనుల్ని ఆపలేదు. ఈ సమస్యను అధిగమించడం అంత తేలిక కాదన్న భావన ఆర్థిక నిపుణుల్లో ఉంది.
దీనిపైనే కసరత్తు
ఈ బడ్జెట్ లొ ప్రభుత్వం ఎన్నికల హామీ అమలుకు సిద్దమైంది. చేయూత పెన్షన్లు పెంపు పైన కొత్త ఫార్ములా ఆలోచన చేస్తోంది. హామీ అమలు చేస్తూనే.. ఒకే సారి ప్రభుత్వం పైన ఆర్దిక భారం పడకుండా కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎన్నికల సమయంలో చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఆలోచనల మేరకు ఈ హామీ అమలు పైన బడ్జెట్ లో స్పష్టత ఇచ్చేలా కసరత్తు సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ పెంపు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా.. పింఛను మొత్తాన్ని విడతల వారీగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.4016 చొప్పున పింఛను ఇస్తోంది. అయితే, ఎన్నికల సమయంలో చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాగా, పెన్షన్ల పెంపు నిర్ణయం అమల్లోకి తెస్తే.. భారీగా ఆర్దిక భారం పెరిగే అవకాశం ఉండటంతో.. కొత్త ఫార్ములా పైన కసరత్తు చేస్తున్నారు. విడతల వారీగా అమలు చేయటం ద్వారా లబ్దిదారుల్లో కొంత మేర సానుకూలత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విడతలవారీగా పెంచితే.. తొలి విడతలో రూ.500 పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని సమాచారం.
బడ్జెట్ లో స్పష్టత ఇచ్చే విధంగా కసరత్తు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం వంటి హామీలను అమలులోకి తెచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి సారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పింఛను అందుతోంది. ఇందుకోసం ప్రతి నెలా రూ.950 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఈ పింఛన్‌ను ప్రస్తుతానికి రూ.500 చొప్పున పెంచితే.. నెలకు సుమారు రూ.210 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే ఏడాదికి రూ.2500 కోట్లకు పైగా భారం ప్రభుత్వంపై పడనుంది. దీనిపై తుది నిర్ణయానికి వచ్చాక బడ్జెట్‌లో కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. తొలి విడతలో పెంచాలని భావిస్తున్న మొత్తాన్ని కూడా కలిపి బడ్జెట్‌లో కేటాయింపులు చేసే విధంగా కసరత్తు కొనసాగుతోంది. చేయూత ఫించన్లను ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి రూ.4 వేలకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నారు. దీని పైన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చేలా కార్యాచరణ సిద్దం అవుతోంది.