కవిత సహా జైలు శిక్ష అనుభవించిన పలువురు
రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రభావం చూపిన లిక్కర్ స్కాం
తీర్పు తర్వాత అన్నాచెల్లి లొల్లి
ముద్ర, తెలంగాణ బ్యూరో:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ చీఫ్ కేజ్రివాల్ సహా కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియాతో పాటు కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ లిక్కర్ కేసులో ఐదు నెలల పాటు కవిత జైల్లో ఉన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఈ కేసు కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అభియోగాలపై తగిన ఆధారాలు లేవని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఆధారాలు లేకుండా ఇరికించారని సీబీఐపై కోర్టు ఆగ్రహం ఆగ్రహం వ్యక్తంచేసింది. 23 మంది తప్పు చేశారని సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందిని రౌస్ అవెన్యూ కోర్టు డిశ్చార్జ్ చేసింది. కుల్దీప్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత కల్వకుంట్ల, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, మూత గౌతం, సమీర్ మహేంద్రు, అమన్దీప్ సింగ్ దాల్, అర్జున్ పాండే, గోరంట్ల బుచ్చిబాబు, రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చంప్రీత్ సింగ్ రాయట్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ చాంద్ మథుర్, శరత్ చంద్రా రెడ్డిలను డిశ్చార్జి చేశారు.
క్లీన్ చిట్
ఢిల్లీ లిక్కర్ స్కాం (ఎక్సైజ్ పాలసీ కేసు)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా అందరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికీ భారీ ఊరట లభించింది. శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ముఖ్యమైన తీర్పు వెలువరించారు. ఈ కారణంగా.. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఈ కేసులో బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ నిర్లక్ష్యాన్ని
కోర్టు స్పష్టంగా చెప్పింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో మెరిట్ లేదు, ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేవు, కుట్ర ఆధారాలు ఏమీ లేవు అని కోర్టు చెప్పింది. ఛార్జ్ షీట్ వాల్యూమినస్ (పెద్దది) అయినా అందులో అనేక లోపాలు, గ్యాప్స్ ఉన్నాయని, సాక్షుల స్టేట్‌మెంట్లు లేదా ఇతర సబ్‌స్టాంషియల్ ఎవిడెన్స్ లేకుండా ఆరోపణలు చేశారని కోర్టు తీవ్రంగా విమర్శించింది. దీంతో ప్రైమా ఫేసి కేసు కూడా లేదని తేల్చి చెప్పి, కేజ్రీవాల్, సిసోడియా సహా మొత్తం 23 మంది ఆరోపితులను డిస్‌చార్జ్ (విముక్తి) చేసింది.
ఈ కేసు ఏంటి..?
2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు, దక్షిణ లాబీ నుంచి రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌లు తీసుకుని కొన్ని సంస్థలకు లాభాలు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. ఏఏపీ నేతలు దీనికి కుట్రలో ఉన్నారని చెప్పింది. కానీ కోర్టు ఆరోపణలను సపోర్ట్ చేసే ఎలాంటి మెటీరియల్ లేదని స్పష్టం చేసింది.తీర్పు వచ్చిన వెంటనే కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోవేగం చెందిన కేజ్రీవాల్ “నాపై తప్పుడు ఆరోపణలు పెట్టారు. మోదీ, అమిత్ షా కలిసి కుట్ర చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. నేను, సిసోడియా, మా పార్టీ నేతలంతా నిజాయితీ పరులు. సత్యం జయించింది” అని వ్యాఖ్యానించారు.
ఈ తీర్పుతో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా సంబంధిత భారీ ఊరటనే ఇచ్చింది. ఆమెపై కూడా ఇదే కేసులో ఆరోపణలున్నాయి. నిందితురాలిగా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ సాక్ష్యాలు లేవని కోర్టు అభిప్రాయం వ్యక్తం చెయ్యడంతో.. ఇప్పుడు ఆమెకు బిగ్ రిలీఫ్ లభించింది.
నెక్ట్స్ ఏంటి:
ఈ తీర్పు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వచ్చి ఉంటే.. మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో గెలిచేదేమో. ఎందుకంటే.. ఈ కేసు.. ఢిల్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంతలా అంటే.. చివరకు కేజ్రీవాల్ తాను పోటీ చేసిన స్థానం నుంచి కూడా ఓడిపోయారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇలా ఈ కేసు ఆప్ నేతలకు తీవ్ర బ్యాడ్ నేమ్ తెచ్చింది. అన్ని రకాలుగా నష్టం చేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ కడిగిన ముత్యంలా వచ్చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ తూచ్ అని తేలిపోవడంతో.. ఆయన ఫ్రీ అయ్యారు. ఇక మళ్లీ రాజకీయాల్లో జోరుపెంచే ఛాన్స్ ఉంది. ఇప్పటి నుంచి కేజ్రీవాల్ ఏం చేస్తారనేది ఆసక్తికర అంశం. ఎందుకంటే.. దెబ్బతిన్న పులిలా ఆయన.. తీవ్రంగా గర్జించే ఛాన్స్ ఉంది. ఆయన టార్గెట్ కేంద్రం, బీజేపీయే అవ్వనుంది. ఇవాళ్టి కన్నీళ్ల నుంచి ఆయన.. నెక్ట్స్ వ్యూహాత్మక నిర్ణయాలు, ఉడుగులు ఉండబోతున్నాయి అనుకోవచ్చు.
ఇక రాజకీయంగా తగ్గేదేలే..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు అందరికీ.. రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో.. కవిత నిర్దోషిగా మారారు. ఆమెపై ఉన్న కేసు కొట్టివేసినట్లైంది. ఇక ఇప్పుడు ఆమె రాజకీయంగా మరింత జోరుగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. ఎవరిపైనైనా ఆరోపణలు, బురద చల్లడం ఈజీ.. కానీ వాటి నుంచి వారు కడిగిన ముత్యంలా రావడం చాలా కష్టం. కోర్టులు తీర్పులు ఇచ్చేవరకూ.. ఆరోపణలు అలాగే ఉంటాయి. నిందితులుగా సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. చివరకు నిర్దోషిగా తేలిన తర్వాత.. అప్పుడు వారిని సమాజం నిజాయితీపరులుగా గుర్తిస్తుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విషయంలో ఇదే జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆమె నిర్దోషిగా తేలడంతో.. ఆమె ఒకప్పుడు జైలుకు వెళ్తూ.. ఏం చెప్పారో.. అదే ఇప్పుడు సాధించినట్లైంది. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పిన ఆమె.. అదే చేశారు.
కాగా, తీర్పు తర్వాత కవిత మాట్లాడుతూ.. “ఈ కేసు విచారణ సమయంలో నాకు అనేక మంది అండగా నిలిచారు. సొంత డబ్బులు పెట్టుకొని ఢిల్లీ వరకూ వచ్చిన జైల్లో ఉన్న నన్ను కలిశారు. మా అత్త, మామ, పిల్లలు.. ఐదున్నర నెలలు నరకయాతన అనుభవించారు. నాకు అండగా నిలిచారు. జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం కూడా అండగా నిలిచింది. ఇది రాజకీయ ప్రేరేపిత, కుట్రపూరిత కేసు. న్యాయవ్యవస్థ గెలిపించింది. సత్యం గెలిచింది. పాలూ, నీరూ వేరువేరయ్యాయి. ఈ కఠిన సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు” అని కవిత తెలిపారు.
“నేను మాత్రమే కాదు.. కేసీఆర్ కూడా ఇది రాజకీయ కుట్రపూరిత కేసు అని చెప్పారు. నేను ఈ కేసు వల్ల చాలా కోల్పోయాను. జైలుపాలయ్యాను. నా కుటుంబానికి దూరమయ్యాను. నేను అనేక రకాలుగా అవమానాలు ఎదుర్కొన్నాను. నా ఐదున్నర నెలల కాలం తిరిగి రాగలదా? దీనికి ఎవరు బాధ్యులు? నన్ను సోషల్ మీడియాలో కూడా అనేక రకాలుగా దుర్భాషలాడారు. నా బొమ్మలను మార్ఫింగ్ చేశారు. వారంతా ఇప్పుడు ఆలోచించాలి. జై తెలంగాణ” అని కవిత అన్నారు.
కవిత పోరాటం:
ఈ కేసులో కవిత పోరాటం ప్రత్యేకమైనది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నా.. సీఎం కేసీఆర్.. ఉన్నత పదవిలో ఉన్నా.. ఆయన కూతురిగా కవిత.. ఈ కేసులో చిక్కుకున్నారు. దాదాపు దాదాపు రెండు సంవత్సరాలుగా విచారణ, అరెస్ట్‌లు ఎదుర్కొన్నారు. ఐదు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం కోర్టు పోరాటం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె.. సొంత కుటుంబం నుంచి దూరమయ్యారు. తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ కూడా ఆమెకు పూర్తి స్థాయిలో అండగా నిలవలేదు. ఆమె అరెస్ట్ అవ్వకుండా చెయ్యలేకపోయారు. న్యాయపోరాటం వారు అనుకున్న స్థాయిలో చెయ్యలేదనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే.. ఆమె జైలు నుంచి బయటకు వచ్చాక.. అదే బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. తనదైన మార్గంలో ముందుకెళ్తున్నారు. త్వరలో రాజకీయ పార్టీ కూడా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఆమె మరింత ఉత్సాహంతో దూసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లే.
కేటీఆర్ ట్వీట్ – కవిత సీరియస్
ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వైఫల్యానికి నేనా కారణం..? అని ప్రశ్నించారు.
“నాపై కేసు ఎందుకు పెట్టారు… పార్టీ కోసం కాదా..? ఇదే విషయం కేసీఆర్ చెప్పలేదా…? నేను జైలుకు వెళ్లే అంత వరకు కూడా కేటీఆర్ ఎందుకు ప్రెస్మీట్ కేసీఆర్ పెట్టలేదు. అనాడు నేను ఒంటరిగా ఫేస్ చేశా. పార్టీ సపోర్ట్ చేయలేదు. బీజేపీ సోషల్ మీడియా ఇష్టానుసారంగా ట్వీట్లు చేసింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను కారణమా..? నాడు ఇండ్లు ఇవ్వకపోవటం, ఉద్యోగాలు ఇవ్వకపోవటం, దోపిడీ దారులకు టికెట్లు, అహంకారం వంటి అంశాలు చర్చలో ఉన్నాయి. ఇవాళ తీర్పును మీరు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు” అంటూ కవిత కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ ట్వీట్ లో ఏముందంటే..?
“మద్యం కుంభకోణం అనే సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ (AAP) ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం భారత రాష్ట్ర సమితి. కవిత గారికి ఈరోజు కోర్టులో న్యాయం జరిగింది. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని మరియు కల్పితమని త్వరలోనే తేలిపోతుంది. కాంగ్రెస్ మరియు బీజేపీలు చేసిన బాధ్యతారహితమైన ఆరోపణలను మనం సత్యం గెలిచేవరకు చూసాం” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు విషయంలో కేటీఆర్ ట్వీట్.. కవితను ఆగ్రహానికి గురి చేసింది. డియర్ బ్రదర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడం బీఆర్ఎస్ పార్టీలో కొత్త చిక్కులు రావడానికి కారణం అవుతోంది. లిక్కర్ స్కామ్ కేసు కొట్టివేతపై స్పందించిన కేటీఆర్ , ఈ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు అని పేర్కొంటూనే, దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా నష్టపోయిందని ట్వీట్ చేశారు. ఈ స్కామ్ అనే నరేటివ్ వల్ల పార్టీ రాజకీయంగా బలి అయిందని ఆయన చేసిన విశ్లేషణ, పరోక్షంగా ఈ కేసు వల్లనే పార్టీ ఓడిపోయిందనే అర్థాన్ని స్ఫురింపజేసింది. ఇదే ట్వీట్‌లో తన సోదరి కవితకు న్యాయం జరిగిందన్నారు.
కేటీఆర్ ట్వట్ పై కవిత తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసు పార్టీ కోసమేనని, అది వ్యక్తిగతమైనది కాదని కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె కేసీఆర్ , కేటీఆర్ వైఖరిని తప్పుబట్టారు. తాను జైలులో ఉన్న సమయంలో కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా తనకు మద్దతుగా నిలవలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం తాను ఇబ్బందులు పడితే, ఇప్పుడు ఓటమిని తన ఖాతాలో వేయడం అన్యాయమని ఆమె భావిస్తున్నారు. కేటీఆర్ తన విశ్లేషణలో వ్యవస్థల తీరును ఎండగట్టారు. సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మీడియా ట్రయల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. న్యూ ఇండియా లో ఆధారాలు లేకుండానే రాజకీయ నేతలను అప్రతిష్టపాలు చేయడం ఒక అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, భవిష్యత్తులో మిగిలిన నాయకులపై ఉన్న తప్పుడు కేసులు కూడా వీగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు కవితకు వ్యక్తిగతంగా ఊరటనిచ్చినప్పటికీ, అన్నాచెల్లెళ్ల మధ్య తలెత్తిన ఈ వాగ్వాదం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది. ఒకవైపు రాజకీయ విజయం సాధించామనే సంతోషం ఉన్నా, మరోవైపు ఓటమికి బాధ్యత ఎవరిదనే విషయంలో కుటుంబం ,పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం చర్చనీయాంశంగా మారింది. కవిత రెండు నెలల్లో పార్టీ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఆమెను బలపరిస్తే.. అది బీఆర్ఎస్ కు నష్టమని .. వీలైనంత వరకూ సైలెన్స్ పాటిస్తున్నారు.