Take a fresh look at your lifestyle.

రాజ్యసభ: బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మైనార్టీ కార్డ్, ఫిరాయింపు ఎమ్మెల్యేలు, రెండు స్థానాల పోటీ

పెద్దల సభా “రాజకీయం”
రెండు స్థానాల్లో కాంగ్రెస్
బల పరీక్ష కు బీఆర్ఎస్
గులాబీ దళం నుంచి మైనారిటీ నేత
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ పరీక్ష
ఇటు హస్తంలో పెరుగుతున్న పోటీ

ముద్ర, తెలంగాణ బ్యూరో: 

రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది. గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీని కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికల చదరంగంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ఎత్తుగడలకు పదును పెడుతున్నాయి. సంఖ్యాబలం తక్కువగా ఉన్నా సరే పోటీకి దిగడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ భావిస్తుండగా, క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల లెక్కల ప్రకారం ఒక్కో అభ్యర్థి గెలవడానికి దాదాపు 60 ఓట్లు అవసరం. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు ఉన్న బలం రీత్యా గెలుపు సాధ్యం కాకపోయినా, ఒక మైనార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేయాలని చూస్తున్నారు. ఒకవేళ తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటు వేస్తే, మైనార్టీల వ్యతిరేకిగా ముద్ర వేయవచ్చనేది ప్రతిపక్ష పార్టీ ఆలోచన. ఈ ఎత్తుగడ ద్వారా కాంగ్రెస్ తన అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేసుకునేలా ఒత్తిడి తేవడమే ప్రధాన లక్ష్యం.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడం కూడా ఈ పోటీ వెనుక ఉన్న మరో ఉద్దేశం. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో పార్టీలు విప్ జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. అయితే, ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ఎవరు ఎవరికి ఓటు వేశారనేది పార్టీ ఏజెంట్లకు స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి ఓటు వేస్తే పదవి పోతుందనే భయం ఒకవైపు, సొంత పార్టీకి వ్యతిరేకంగా వెళ్లలేని పరిస్థితి మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెంటాడుతున్నాయి. విప్ ఉల్లంఘనపై అనర్హత వేటు పడుతుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టులో గతంలో భిన్నమైన తీర్పులు ఉన్నా, రాజకీయంగా వారిని దోషులుగా నిలబెట్టాలని బీఆర్ఎస్ ఆశిస్తోంది.

రెండు సీట్లు గెలుచుకునే బలం కాంగ్రెస్‌కు
ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది సొంత ఎమ్మెల్యేలు ఉండగా, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారితో కలిపి ఆ సంఖ్య 73కి పెరిగింది. ముగ్గురు పోటీలో ఉంటే రెండు స్థానాలను గెలవడానికి కావాల్సిన ఓట్లు సుమారు 80 ఓట్లు. మజ్లిస్ మద్దతుతో సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మజ్లిస్ పార్టీ మద్దతు కూడా కాంగ్రెస్‌కే ఉండే అవకాశం ఉండటంతో సంఖ్యాపరంగా అధికార పార్టీకి ఎటువంటి ఢోకా లేదు. బీఆర్ఎస్ పోటీ పెడితే మాత్రం ప్రతి ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా అది ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచుతుంది.

ఇదే బీఆర్ఎస్ ఆశ
గెలుపు అవకాశాలు లేవని తెలిసినా బీఆర్ఎస్ మైనార్టీ కార్డును ప్రయోగించడం వెనుక ఆత్మప్రబోధానుసారం ఓటు అనే అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలు, మైనార్టీ అభ్యర్థి పట్ల సానుభూతి ఉన్నవారు తమకు ఓటు వేస్తారని బీఆర్ఎస్ ఆశిస్తోంది. ఇది కేవలం గెలుపు కోసం చేసే ప్రయత్నం కంటే కూడా, కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉన్నాయని నిరూపించడానికి చేసే ఒక రాజకీయ ప్రయోగం. ఒకవేళ కాంగ్రెస్ లోని మైనార్టీ ఎమ్మెల్యేలు లేదా ఇతర నేతలు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తే అది బీఆర్ఎస్‌కు పెద్ద విజయంగా మారుతుంది.

ఎన్నికల ఫలితం కంటే రాజకీయ ప్రభావమే ఎక్కువ
ఈ రాజ్యసభ ఎన్నికలు కేవలం సభ్యుల ఎంపికతో ముగిసేవి కావు. వీటి ఫలితం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్ పడే తపన, వారిని ఇబ్బంది పెట్టడానికి బీఆర్ఎస్ వేసే ఎత్తుగడలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయి. అభ్యర్థుల ఖరారు నుండి ఓటింగ్ ముగిసే వరకు ప్రతి అడుగు అత్యంత కీలకంగా మారనుంది. అంతిమంగా ఈ యుద్ధం సంఖ్యాబలానికి, సామాజిక వ్యూహాలకు మధ్య జరుగుతున్న పోరాటంగా మిగిలిపోనుంది.

రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..?

తెలంగాణలో రెండు స్ధానాలు ఖాళీ అవుతుండటంతో అధికార కాంగ్రెస్ లో ఆశావహుల జాబితా పెద్దగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెండు స్ధానాలనూ దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తుండటంతో ఆశావహులు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. నామినేషన్ల దాఖలుకు మార్చ్ 5 తుది గడువు కావడంతో అభ్యర్ధులెవరన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా కనిపిస్తోంది.

సింఘ్వీకి మరో సారి అవకాశం పక్కా…
ప్రస్తుత సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీకి పార్టీ మరోసారి అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ నేత అవడం, న్యాయవాదిగా సుప్రీంకోర్టులో పార్టీ తరఫున అనేక కేసుల్లో వాదించిన సేవలు ఆయనకు అదనపు అర్హతలు. కే కేశవరావు రాజీనామా తర్వాత ఏర్పడిన రెండేళ్ల స్వల్పకాలం మాత్రమే ఆయనకు అవకాశం దక్కింది. అందువల్ల ఇప్పుడు సింఘ్వీ పునర్నియామకం కేవలం లాంఛనం మాత్రమే.

రెండో స్ధానం కూడా కాంగ్రేస్ కే..!
అసెంబ్లీలో సంఖ్యా బలం పరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సునాయాసంగా దక్కుతుంది. పార్టీకున్న 66 స్ధానాలకు తోడు సీపీఐ సభ్యుడు బలంతో పార్టీకి 67 స్ధానాల బలముంది. 40 మంది మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఒక అభ్యర్ధి గెలిస్తే రెండో అభ్యర్ధి గెలుకోసం మిగిలిన 27 మందితో పాటు మరో 13 మంది మద్దతు అవసరం. రాజ్యసభ ఎన్నిక కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో జరుగుతుంది కాబట్టి పార్టీలు ఇచ్చే విప్ చెల్లదు. కాబట్టి ఇతరపార్టీల అభ్యర్ధులు కూడా తమకు ఓటేస్తారని వ్యూహంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆలెక్కన బీఆరెస్ కు దూరంగా వుంటున్న రెబల్ ఎమ్మెల్యేలు కూడాతమకే ఓటేస్తే కాంగ్రెస్ విజయం నల్లేరుపై నడకే అవుంతుంది. బీఆరెస్ ఒకవేళ పోటీ కి తమ అభ్యర్ధిని బరిలోకి దింపినా బీజేపీ, ఎంఐఎంలు తటస్ధాగా వుండే అవకాశాలే ఎక్కువ.

ఆ రెండో అభ్యర్ధి ఎవరు.. ?
కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందనుకుంటున్న ఆరెండో రాజ్య సభ స్ధానానికి అభ్యర్ధి ఎవరనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని సమాచారం. ఇండియా కూటమి అభ్యర్దిగా ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పోటీలో నిలవడం, తెంలంగాణా ప్రత్యేక రాష్ట్ర సమర్ధకులు కూడా ఐనందున ఆయన పోటీకి పెద్దగా అభ్యంతరాలుండవని సీఎం వ్యూహం. ఆకోనంలో బీఆరెస్ కూడా ఆయన్ను వ్యక్తిగతంగా వ్యతిరేకించే అవకాశాలు తక్కువ. బీఆరెస్ రెబల్స్ కి తద్వారా ఓ కారణం చూపుకునే అవకాశం కూడా దొరుకుతుంది.

ఆశావహుల జాబితా చాలా పెద్దదే..
పార్టీలో చాలాకాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు వీ. హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, జీవన్ రెడ్డి లు తమకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి తమవంతు కృషిచేసామని ఇప్పడైనా తమను గుర్తించాలని హైకమాండ్ ను కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ అవకాశం ఇవ్వడం ద్వారా ఢిల్లీలో తన పట్టు మరింత పెంచుకునే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. కే. కేశవరావు కూడా తన రెండేళ్ల రాజ్యసభ పదవీకాలాన్ని సిఘ్వీకోసం త్యాగం చేసినందున ఇప్పడు తనకు మరో అవకాశం ఇస్తరన్న అంచనాలో వున్నట్టు తెలుస్తోంది.
వీరెవరికీ కాదు పార్టీ సామాజిక కోణంలో ఆలోచిస్తే మైనారిటి కోటాలో తనకు అవకాశం వస్తుందని షబ్బీర్ అలీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సంపత్, ఎస్టీ సామాజిక వర్గంనుంచి జాతీయ స్ధాయిలో పార్టీ తరఫున గిరిజన వర్గాల కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేసిన బెలయ్య నాయక్ కి అవకాశం ఇస్తారన్న అంచనాల్లో ఆయా అభ్యర్ధులు ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.