- ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క.
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : మొక్కలు నాటి వాటిని సంరక్షించినప్పుడే పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణ కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు) లో వన మహోత్సవం కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా పాల్గొని చెట్లు నాటారు. ఆమెతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో ముస్తాబుచేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రకృతి పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సారి మరింత విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించాలనే సంకల్పంతో ముందడుగు వేసిందన్నారు.
- అధికారులతో మంత్రి సమీక్ష.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ఇంచార్జి మంత్రి ,రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి పేదవారికి అందే విధంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, సురేష్ సేట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంత రావు,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు,జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, SP శ్రీ రాజేష్ చంద్ర, జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
