మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది..
ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఒక వరం..
గ్రామ గ్రామానా విస్తృతంగా పథకంపై అవగాహన కల్పించాలి..
జిల్లాలో సక్సెస్ ఫుల్ గా పథకం సద్వినియోగం
మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక అభివృద్ధి సాధించాలి..
ఆర్టీసీలో మహాలక్ష్మి ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణం ద్వారా పదివేల కోట్ల ప్రయాణ చార్జీల ఆదా పై కరీంనగర్ బస్టాండ్ లో అభినందన కార్యక్రమం..
ముద్ర, కరీంనగర్ :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. మహిళలకు మరింత శక్తిని అందించిన ఈ పథకం, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందన్నారు.
ఆర్టీసీలో మహాలక్ష్మి కింద 290 కోట్ల ఉచిత ప్రయాణం ద్వారా పదివేల కోట్ల ప్రయాణ చార్జీల ఆదా అవడంతో కరీంనగర్ బస్టాండ్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందడమే కాకుండా, ఉపాధి, విద్య, వైద్యం వంటి రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలు విద్యార్థులు కార్యాలయాలకు పాఠశాలలకు వివిధ పనుల కోసం వెళ్లేందుకు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రామ గ్రామానా ఈ పథకం పై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. జిల్లాలో మహాలక్ష్మి పథకం సక్సెస్‌ఫుల్‌గా అమలవుతూ మహిళల సాధికారతకు బలమైన వేదికగా నిలుస్తోందని కలెక్టర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం మహిళల ఆర్థిక అభివృద్ధిలో వినూతనమైన మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. ఈ పథకం గొప్ప మైలురాయి సాధించిందని మహిళలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మహిళలు ఫ్యామిలీ ఫంక్షన్లు కార్యాలయాలకు వెళ్లేందుకు పర్యటక ప్రాంతాలు సందర్శించేందుకు సమావేశాలకు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కరీంనగర్ జిల్లాలో మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 6.91 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళ ప్రయాణికులు 308.84 కోట్ల లబ్ది పొందారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో ఈ పథకంపై విస్తృతంగా ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళలు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రయాణికులను అధికారులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్ ,ఆర్డిఓ కే మహేశ్వర్ ,జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మెప్మా పీడీ స్వరూపా రాణి ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలోమన్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి రాజు డిప్యూటీ రీజినల్ మేనేజర్లు పి మల్లేశం ఎస్ భూపతిరెడ్డి

వన్ డిపో మేనేజర్ విజయ మాధురి పర్సనల్ ఆఫీసర్ సంపత్ అకౌంట్స్ ఆఫీసర్ రవికుమార్
పలువురు ఆర్టీసీ అధికారులు సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది గొప్ప ఆలోచన..జమున అంగన్వాడి కార్యకర్త..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప ఆలోచన చేసి మహాలక్ష్మి పథకానికి రూపకల్పన చేశారు.మహిళలు విద్యార్థులు విద్యా ఉపాధి కోసం ఏ ప్రాంతం నుంచైనా ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలందరికీ డబ్బు ఆదా అవుతుంది. ఆ డబ్బును పొదుపు చేసుకుంటున్నాం. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది.
మహిళల ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర..
బండారి రేణుక.. టీఎల్ఎఫ్ ఓబి పట్టణ సమైక్య మెప్మా
మహిళల ఆర్థిక అభివృద్ధిలో మహాలక్ష్మి పథకం కీలకపాత్ర పోషిస్తున్నది. మహిళలు గర్భిణీ స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆర్టీసీని వినియోగించుకుంటున్నారు. ఏ అవసరం ఉన్న ఈ పథకాన్ని వాడుకుంటున్నారు.
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతున్నది. మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఈ పథకంతో బలమైన అడుగు పడుతున్నది.
డబ్బు ఆదా అవుతోంది..
మయూరి.. నవభారతి మండల సమైక్య అధ్యక్షురాలు కరీంనగర్ రూరల్ మండలం..
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల మహిళలందరికీ నెల నెల పదివేల వరకు డబ్బు ఆదా అవుతున్నది. ఆ డబ్బును పొదుపు చేయడంతో పాటు కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నాం. డబ్బు ఆదా అవడం వల్ల ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుంది మహిళలకు. విద్యార్థులు కూలీలు మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది.
మహిళలకు గొప్ప వరం..
మార్గం లత శ్రీ.. మానేరు మండల సమైక్య అధ్యక్షురాలు కొత్తపల్లి మండలం..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మహిళలకు గొప్ప వరం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ సారధ్యంలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చింది. ఈ పథకం ఎంతో మంది మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. మండల జిల్లా సమావేశాలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్నాం. చక్కగా వినియోగించుకుంటున్నాం మంచి పథకం..
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..
మంజుల.. మెప్మా
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. మహిళలకు ఎంతో దోహదపడుతున్నది ఈ పథకం. పిల్లలు స్కూల్కు వెళ్లేందుకు విద్యార్థులు కాలేజీకి వెళ్లేందుకు మహిళలు చిన్న చిన్న పనులు చేసుకొని ఉపాధి పొందేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వ అమలు చేస్తున్నది. చార్జీల భారం లేదు. సంతోషంగా ప్రయాణిస్తున్నాం. డబ్బులను ఆదా చేసుకుంటున్నాం.
ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నది..స్వరూప అంగన్వాడి టీచర్
మహాలక్ష్మి పథకం మంచి పథకం.
ఆపత్కాలంలో మహిళలకు అండగా నిలుస్తున్నది. అత్యవసరంగా బయటకు వెళ్లేందుకు మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. చిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. జీతాలు తక్కువ ఉండడం వల్ల బస్సుల్లో ప్రయాణించడం వల్ల కొంత డబ్బులను ఆదా చేసుకుంటున్నాం. మహిళల్లో ఎంతో మార్పు వచ్చింది. సమావేశాలకు ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటున్నాం. ఎంతో లాభం చేకూరుతున్నది. ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.