జాతీయ వేదికపై విరాజిల్లిన నిర్మల్ ఖ్యాతి జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు ఢిల్లీలో స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి , నిర్మల్ :
జాతీయ వేదికపై మరోసారి నిర్మల్ జిల్లా మరోసారి తన ఖ్యాతిని చాటింది. జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. వివిధ జిల్లా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గాను ఈ అవార్డులు నిర్మల్ జిల్లా సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదికగా ఈ అవార్డులను కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్వీకరించారు. జిల్లాకే తలమానికమైన కొయ్య బొమ్మల పరిరక్షణ, చారిత్రాత్మక వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో కొయ్య బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి కర్ర కోసం ఏర్పాటు చేసిన పొనికి వనానికి జాతీయ స్థాయి స్కోచ్ అవార్డు లభించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మితో కలిసి కలెక్టర్ దీన్ని స్వీకరించారు. “అమ్మరక్షిత” అనే వినూత్న కార్యక్రమం ద్వారా మాతృత్వ మరణాలు తగ్గించిన కారణంగా మరో స్కోచ్ అవార్డును వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్ తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరో మారు జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు రావడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. అధికారుల ఉత్తమ పనితీరుతో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి, అవార్డు సాధనలో కృషి చేసిన అధికారులందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు