సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి.ఆర్.ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి రైతులంటే చిన్న చూపే ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమయానికి రైతుబంధు అందించారని వ్యవసాయాన్ని రాష్ట్రానికి వెన్నెముకగా నిలిపారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పంట కోతకు వచ్చిన కూడా ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు జమ చేయలేదన్నారు. అలాగే కందుల కొనుగోలు లో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న నియమ నిబంధన వల్ల తక్కువ ధరకే రైతులు కందులను బయట మార్కెట్లోఅమ్ముకుంటున్నారన్నారు. రైతులు యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని షాపుల్లో లేని యూరియ యాపుల్లో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఉగాది పండుగలోగా రైతులందరికీ రైతుబంధు అందించి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్ లు నాగరాజు రెడ్డి, మల్లిఖార్జున్, నాయకులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొన్నమల్ల రాములు, ఇర్షాద్ హుస్సేన్, సత్యం రెడ్డి, దరిపల్లి శ్రీనివాస్, సయీద్ , సాయి చరణ్ గౌడ్ కిట్టు, శ్రీనివాస్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.