కుషాయిగూడ, ముద్ర విలేఖరి: చర్లపల్లి డివిజన్ ఆదర్శనగర్ కాలనీలో.. స్వచ్ఛత నియమాలను పాటించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆదర్శనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ తో కలిసి కాలనీవాసులు అవసరమైన ప్రాంతంలో బిగించారు. అలాగే పారిశుద్ధ్యం సిబ్బంది, రాంకీ సంస్థ ప్రతినిధులు.. కాలనీలో ఇంటింటికి వెళ్లి స్వచ్ఛత సర్వేక్షన్ పై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరుచేసి ఆటో రిక్షా కార్మికులకు అందజేయాలని వివరించారు. ఈ సందర్భంగా సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఆదర్శనగర్ కాలనీ అధ్యక్ష కార్యదర్శులు బండారు యాదగిరి, పోల్కం శ్రీరాములు మాట్లాడుతూ.. కాలనీలో ఇంటింటికి వెలువడే చెత్తను విధిగా చెత్త రిక్షాకార్మికులకు అందజేయాలన్నారు.ఇక బహిరంగ ప్రదేశంలో చెత్త వేయకుండా సీసీ కెమెరాలతో పాటు, స్వచ్ఛత నియమాలు పాటించాలని కోరుతూ మైకులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.స్వచ్ఛత నియమాలు పాటించకుండా బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి జరిమానా విధిస్తామని తెలిపారు. కాలనీ బహిరంగ ప్రదేశంలో చెత్త వేయకుండా నివారించేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ కోరారు. స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న ఆదర్శనగర్ కాలనీ సంక్షేమ సంఘంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ అధ్యక్షుడు శ్యామల స్వామి, కాలనీవాసులు ఎస్ రాజు, కంచుకుంట్ల మల్లేష్, కొమ్ము ఉపేందర్, ఏ శ్రీనివాస్, పారిశుద్ధ్య విభాగం జవాన్ అశోక్, ఎస్ ఎఫ్ ఏ అంజలి, అరవింద్, రాంకీ సంస్థ సూపర్వైజర్ సర్కిల్ ఇంచార్జ్ నవీన్ రెడ్డి, రాంబాబు, మధు, నరసింహారెడ్డి, ఆటో రిక్షా కార్మికుడు కోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.