Take a fresh look at your lifestyle.

వరద పారదు.. బురద తీయరు

  • వార్డుల్లో అస్తవ్యస్థంగా కాలువలు.

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : వర్షాకాలం ప్రారంభం కావడంతో పాటు వార్డుల్లో చేపట్టే పారిశుద్ధ్య పనులు కొన్ని వార్డుల్లో చేపట్టడం లేదనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో పిచ్చి మొక్కల తొలగింపు,కాలువలను శుభ్రం చేసే పనులు కాస్త నెమ్మదిగా చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రధాన కాలువలలో పిచ్చి మొక్కలు పెరికి వరద,బురద పేరుకు పోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వాటితో దోమల వ్యాప్తి,విష సర్పాల సంచారం విపరీతంగా పెరుగుతున్నాయి. అంతే కాకుండా దోమల వ్యాప్తితో విష జ్వరాలు, అనారోగ్యాల పాలవుతున్నారు పుర ప్రజలు. మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రధాన కాలువల దుస్థితి మరి అధ్వానంగా మారింది. గత ఆరు నుంచి ఏడు నెలల పాటు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం లోనే పనులు పూర్తి స్థాయిలో చేపట్టినట్లయితే విష జ్వరాలతో పాటు అనారోగ్య సమస్యల నుంచి పుర ప్రజలను అధికారులు రక్షించిన వారవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆరో వార్డులోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ముందు పిచ్చి మొక్కలు,వరద నీరు చేరి ఇబ్బందిగా మారింది.

  • ప్రధాన కాలువలో పిచ్చి మొక్కలు

స్థానిక 6,11,14,15,18 వార్డుల్లో ప్రధాన కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మురికి నీరు ప్రవహించే కాలువలలో పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. వరద ప్రవాహంతో కొట్టుకొచ్చిన బురద పెరిగిన పిచ్చి మొక్కలతో పేరుకు పోయి దోమలు, విష సర్పాలకు అడ్డాలుగా మారాయి.కొన్ని చోట్ల కాలువలలో చెత్త,చెట్ల కొమ్మలు చేరి నీరు ఇండ్లలోకి వస్తున్నాయి.గత సంవత్సరం వర్షాకాలంలో ఇండ్లలోకి నీరు చేరిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల డ్రైనేజీ వ్యవస్థను మురికి కాలువలోకి వదలడంతో పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాలువలోకి డ్రైనేజీ వ్యవస్థను ఉంచిన వారిపై మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే పూర్తి స్థాయిలో పూడిక తీసి కాలువలలో నీరు ప్రవహించే విధంగా చేయాలంటున్నారు.

  • త్వరలోనే పనులు చేపడుతాం..

ప్రభుత్వం ప్రకటించిన 15 కోట్ల రూపాయల నిధుల్లో 10 కోట్ల రూపాయలతో సైడ్ డ్రైనేజీ,సీసీ రహదారి పనులకు ప్రత్యేక ప్లాన్ రూపొందించి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్ళి పనులు పూర్తి స్థాయిలో చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. పాత కాలువల నిర్మాణ పనులకు సైతం నిధులను కేటాయించి మరమ్మతులు చేపడతామన్నారు. కాలువలోకి డ్రైనేజీ వ్యవస్థను వదులుతున్న వారికి నోటీసులను ఇష్యూ చేసి అండర్ గ్రౌండ్ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ‘ముద్ర’ విలేకరితో పుర కమిషనర్ రాజు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.