- మహిళల ఆరోగ్యం నుంచి సంపాదన వరకు వివరాలన్నీ ఆ కార్డులోనే.
- వివరాల ఆధారంగా సభ్యులందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు.
- ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టిస్తాం.
- వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని కోటి మంది మహిళా సంఘాల సభ్యులకు ఒక యూనిక్ ఐడీ కార్డు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.మహిళల ఆరోగ్యం నుంచి సంపాదన వరకు వివరాలన్నీ యూనిక్ కార్డులోనే ఉండేలా రూపొందిస్తామని కీలక ప్రకటన చేశారు.ఆ సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమలులోకి తేవాలని అధికారులకు సూచించారు.ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని చెప్పారు. శనివారం జూబ్లీహిల్స్‌లో వీహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.కార్యక్రమం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. మహిళా సంఘాలతో కలిసి పనిచేయడానికి సంబంధించి వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహనా ఒప్పంద పత్రాలను సీఎం సమక్షంలో మార్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ మహిళలకు తప్పకుండా అండగా నిలబడతామన్న సీఎం వారిని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని దేశం విడిచి పారిపోతున్నారని ఆరోపించారు.అందుకే ప్రభుత్వం కూడా ఆడబిడ్డలను ప్రొత్సహించాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తుందన్నారు.ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కకుంటేనే కుటుంబాలు బావుంటాయని చెప్పారు. గడిచిన ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించిందన్నారు. తెలంగాణ, వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం సాధంచాలంటే రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని సూచించారు. ఆ లక్ష్య సాధనలో భాగంగానే మహిళలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం వెల్లడించారు.మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఒక్కో మహిళ నెలకు దాదాపు రూ.5 వేల మేరకు ఆదా అయిందన్నారు. ఆర్టీసీ కూడా లాభాల బాట పట్టిందని చెప్పారు.ఆర్టీసీ ద్వారా నడుపుకోవడానికి మహిళా గ్రూపులకు ఇప్పటికే 150 బస్సులను కేటాయించినట్లు వివరించారు.అదనంగా మరో 600 బస్సులను వెంటనే తీసుకుని నడిపించాలని అధికారులను ఆదేశించారు.అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని కేటాయిస్తామన్నారు. రూ.500 లకే సిలిండర్ అందిస్తున్నామన్న సీఎం పాఠశాలల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించినట్లు చెప్పారు.పాఠాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు 1.30 కోట్ల యూనిఫామ్ డ్రెస్సుల బాధ్యత కూడా వారికే అప్పగించామన్నారు.పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే నిర్వహించే వ్యాపారాల్లో సైతం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు.ఆడపడుచులకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి మహిళా సంఘాలను ప్రోత్సహించి రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా ఒప్పందాలు చేస్తున్నట్లు చెప్పారు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలున్న హైటెక్ సిటీ దగ్గరలో మూడున్నర ఎకరాల స్థలంలో మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించినట్లు సీఎం తెలిపారు.ఇలా ప్రతి చోటా, ప్రతి సందర్భంలోనూ మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని సీఎం చెప్పారు. మహిళా శక్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం గతేడాది రూ. 20 వేల కోట్ల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు అందించామన్నారు. అయితే ఒక్క రూపాయి కూడా ఎగవేయకుండా ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో తిరిగి చెల్లించారని మహిళ సంఘాల సభ్యులకు కితాబిచ్చారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇస్తున్న గుర్తింపు కార్డు స్థానంలో ఒక యూనిక్ ఐడీ కార్డు జారీ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహిళలకు అవసరమైన హెల్త్ చెకప్ చేయించడం,హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయించడం, ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత సహాయం అందించడం కాదు.వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా సహాయం అందించవచ్చన్నారు.పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డలు వ్యాపారాల్లో నిలదొక్కుకున్నప్పుడే కుటుంబాలు ఆర్థికంగా నిలబడుతాయన్నారు.1967 లో చైనాతో, 1971 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సందర్బంగా ఇందిరా గాంధీ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. మహిళా శక్తి అండగా ఉంటే దేశం అభివృద్ధి పథం వైపు నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ రెడ్డి, వీహబ్ ప్రతినిధులు, వివిధ సంస్థలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.