Take a fresh look at your lifestyle.

ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించండి

 

ఆశ కార్యకర్తలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బి సుజాత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఆశా వర్కర్లు గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారికి తగిన వేతనాలు, సామాజిక భద్రతా సదుపాయాలు లేకపోవడం అన్యాయమన్నారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18వేల వేతనం నిర్ణయించి, పెండింగ్‌లో ఉన్న జనవరి, ఫిబ్రవరి నెలల పారితోషికాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు రూ.1500 పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.పీఆర్‌సీ ఎరియర్స్, సర్వేలు, పోలియో కార్యక్రమాలు, ఎన్నికల విధులు వంటి పలు పనులకు సంబంధించిన బకాయిలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆశా వర్కర్లకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, వైద్య ఖర్చులకు రూ.50 వేల సాయం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ సమయంలో రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని కోరారు. వారానికి ఒక రోజు సెలవు, పండుగల సందర్భంగా ప్రత్యేక సెలవులు ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా వర్కర్లకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత, కార్యకర్తలు సౌమ్య, మంగ, శారద, అనురాధ, స్రవంతి, లావణ్య, అనురాధ,సుజాత, ఊర్మిళ, సునీత,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.