Take a fresh look at your lifestyle.

భట్టికి హోం శాఖ..?

  • ఎవరికి.. ఏ శాఖ..?
  • మంత్రుల శాఖల్లో మార్పులు.
  • ఢిల్లీకి సీఎం రేవంత్​.
  • ఏఐసీసీ నేతలతో చర్చ.
  • ఏఐసీసీ ఆమోదంతోనే మంత్రులకు శాఖలు.

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కేబినెట్​ విస్తరణలో కొంత భాగం పూర్తయింది. ఇంకో మూడు స్థానాలు ఖాళీ ఉంచి.. ముగ్గురితో ప్రమాణస్వీకారం చేయించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే విస్తరణ పూర్తి కావడంతో శాఖల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, వివేక్‌లకు శాఖలు కేటాయించాల్సి ఉంది.ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.మంగళవారం ఏఐసీసీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఆర్థిక, పౌర సరఫరాల శాఖలతో సహా పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది.

సీఎం రేవంత్​రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్‌ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై హైకమాండ్‌తో చర్చించనున్నారు.అలాగే, పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం.

  • ఇక్కడా ఏ అంశం..?

ఇదిలా ఉండగా కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే.. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్‌ తదితర శాఖలున్నాయి. ఇందులో మున్సిపల్‌ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి.ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్‌ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్‌ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్‌లు, చాంబర్‌ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసింది. సీఎం కాకుండా.. కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57 శాతం(8 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. మొత్తం 14 మందిలో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు 4, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు. అడ్లూరి లక్ష్మణ్‌.. మాదిగ, గడ్డం వివేక్‌.. మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజ్‌ వర్గీయుడు.

  • భట్టికి హోం..?

అయితే పాత మంత్రుల శాఖల్లో పెద్ద మొత్తంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రుల మార్పుపై సీఎం ఏఐసీసీ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. భట్టి ఆర్థిక శాఖతో పాటు విద్యుత్, ఉత్తమ్ సివిల్ సప్లయ్ శాఖతో పాటు భారీ నీటి పారుదల శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈ శాఖల మార్పులతో పాటుగా.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నహోం, మున్సిపల్, విద్యా శాఖ, ఇతర కీలక శాఖల కేటాయింపులపైనా ఢిల్లీలో చర్చించే అవకాశముంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కీలకమైన హోం శాఖ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అలాగే శ్రీధర్‌బాబుకు ఐటీతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇతర కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఐటీ శాఖ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం హోం, మున్సిపల్ సీఎం వద్దే ఉన్నాయి.కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి కూడా ప్రాధాన్యతతో కూడిన శాఖలు దక్కే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.