ఇళ్ల నుంచి వచ్చే చెత్తను మున్సిపాలిటీ ఆటోలోనే వేయాలి – ఒకటో వార్డులో పర్యటించిన కలెక్టర్ -వయోవృద్ధుల ఆశ్రమం, బాల సదనం సందర్శన
ముద్ర, నారాయణపేట:
ఇళ్లలో పోగు అయ్యే చెత్తను మున్సిపాలిటీ చెత్త సేకరణ ఆటోలలోనే వెయ్యాలని, ఆరుబయట పరిసరాలలో వేయవద్దని వార్డు ప్రజలకు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక సూచించారు.

సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డులో విసృతంగా పర్యటించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యాచరణలో భాగంగా ఒకటో వార్డులో కొనసాగుతున్న పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్ ను మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్ తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలనలో భాగంగా వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మురుగు కాల్వల పరిశుభ్రతపై ఎలా ఉందో వార్డు వాసులతో వాకబు చేశారు. వార్డులలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, పారిశుధ్య సేవలను మరింత మెరుగు పరచాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అంతకు ముందు కలెక్టర్ ఒకటో వార్డు బారంబావి సమీపంలో గల వయోవృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధుల యోగ క్షేమాల గురించి అడిగి, వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆశ్రమంలో ఎంతమంది వృద్దులు ఉన్నారని, వారికి కల్పిస్తున్న వసతి సదుపాయాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో అవసరైన సదుపాయాలను నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పక్కనే ఉన్న బాలసదన్ కూడా కలెక్టర్ సందర్శించారు అక్కడున్న విద్యార్థుల తో ముచ్చటించారు. విద్యార్థుల వివరాలను తెలుసుకున్న ఆమె ఎవరెవరు ఏ, ఏ తరగతులు చదువుతున్నారనీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.