ముద్ర ప్రతినిధి, భువనగిరి : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పోరేట్ శక్తుల, గ్రామీణ ధనిక వర్గాల ప్రయోజనాల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఊరేసి, ప్రజల హక్కుగా ఉన్న పనిని వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా విబి-జి రామ్ జి చట్టాన్ని తెచ్చారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ విమర్శించారు.
సోమవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో జి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ ఉపాధి హామీ కార్మికులతో కలిసి ” నిరసన” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ భారతంలో కుల, మత, లింగ బేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు వారి జీవన హక్కులను బలోపేతం చేయడానికి వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ వన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా కోట్లాదిమంది కూలీలకు స్వ గ్రామంలోని ఉపాధి లభించిందని ఆకలి బాధలు, వలసలు తగ్గాయని ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగిందని, మహిళల ఆర్థిక గౌరవాన్ని బలోపేతం చేసిందని అన్నారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ దాని ప్రభావం గ్రామీణ భారతంపై పెద్దగా పడలేదని కరువుల్లోనూ, కరోనా సమయంలోను గ్రామీణ ప్రజలను ఉపాధి హామీ చట్టము ఆదుకుందని తెలిపారు. అలాంటి చట్టానికి మోడీ సర్కారు 10 ఏళ్లుగా తూట్లుబొడుస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలో భాగంగా జి రామ్ జి చట్టాన్ని తెచ్చారని అన్నారు. 40 శాతం నిధులు రాష్ట్రాలు భరించాలని నిబంధన మోడీ సర్కార్ తీసుకొచ్చిందని, 40 శాతం రాష్ట్రాలు ఖర్చు పెడితేనే 60% నిధులు కేంద్రం బరిస్తుందని మెలిక పెట్టానని విమర్శించారు. 125 రోజులకు ఉపాధి పనిని పెంచామని చెప్తున్న మోడీ ప్రభుత్వం దీనిని అమలు చేయాలంటే బడ్జెట్లో రూ.3 లక్షల కోట్లు కేటాయించవలసి ఉండగా కేవలం రూ. 95 వేల కోట్లకే పరిమితం చేసిందని విమర్శించారు. వీరు కేటాయించిన నిధులు పాత అప్పులకు కూడా సరిపోవని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నూతన విబి – జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను కొనసాగించాలని నర్సింహ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ, మండల అధ్యక్షులు బొల్లెపల్లి కిషన్, మండల నాయకులు ఏదునూరు వెంకటేష్ తో పాటు గ్రామానికి సంబంధించిన కడారి కృష్ణ , మైలారం శివ, ఎండి. రఫీక్, తూముకుంట వెంకటేష్, పన్నాల నరేందర్ రెడ్డి, బొల్లెపల్లి రమ్య, బొల్లెపల్లి సోనీ, బొల్లెపల్లి కల్పన, బొల్లెపల్లి అనిత, జనగాం సుమలత, ఏదునూరి సోనీ, మావురం భారతమ్మ, గోసన విజయ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.