జూన్ లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్
ఈ నెల15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఈ నెల15 నుంచి 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఏడాదిలో ఇది రెండో టెట్ నోటిఫికేషన్ కావడంతో, డీఎస్సీ (డిఎస్సీ) కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మారనుంది. అయితే తక్కువ సమయం ఉన్నందున అభ్యర్థులు అప్రమత్తమై దరఖాస్తు ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం, జూన్ నెలలో టెట్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల జారీ, ఇతర సాంకేతిక అంశాలపై విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. దీంతో అభ్యర్థులు సిలబస్‌ను సరిచూసుకుని, జూన్‌లో జరిగే పరీక్షలకు సిద్ధం కావాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
దరఖాస్తు గడువు – ఫీజు వివరాలు
టెట్ 2026కి అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించారు. ఈ పరీక్షలకు ఒక్క పేపర్‌కు బీసీ/ఓసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ/ఎస్టీ/పిహెచ్ అభ్యర్థులకు రూ.700. రెండు పేపర్లకు బీసీ/ఓసీ అభ్యర్థులకు రూ. 1000, ఎస్సీ/ఎస్టీ/పిహెచ్ అభ్యర్థులకు రూ. 950 రూపాయలకు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్షల షెడ్యూల్- అర్హత మార్కులు
టెట్ పరీక్షలను జూన్ 15 నుండి జూన్ 30, 2026 మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి) విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు జూన్ 09 నుండి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60శాతం, బీసీ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ/ఎస్టీ/పిహెచ్ అభ్యర్థులకు 40శాతం అంతకంటే ఎక్కువ మార్కులు రావడం తప్పనిసరి. ఈ పరీక్షా ఫలితాలను జూలై 28 నుండి 31 మధ్య విడుదల చేసేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు కోరుతున్నారు.