Take a fresh look at your lifestyle.

అరుదైన వ్యాధితో చిన్నారి పోరాటం.. ఆదుకోవాలని వినతి

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

ఆడుతూ పాడుతూ తల్లిదండ్రుల చెంత ఆనందంగా ఉండాల్సిన అరునెలల చిన్నారిని అరుదైన వ్యాధి వెంటాడుతోంది. హైదరాబాద్ లోని‌‌ రేయిన్ బో‌ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించినట్లు గద్వాల మండలం పరుమాల గ్రామానికి చెందిన మౌనిక రమేష్ దంపతులు తెలిపారు. తమ కూతురు చైత్రికకు అత్యంత అరుదైన స్పైనల్‌ మస్ క్యులర్‌ అట్రోఫి(ఎస్‌ఎంఏ) టైప్‌–1 వ్యాధి సోకిందని హైదరాబాద్ లోని రేయిన్ బో ఆస్పత్రిలో ఇటీవల చే­యించిన వైద్య పరీక్షల్లో బయట పడిందన్నారు. ఈ వ్యాధి వల్ల కండరాలు బలహీనపడి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది.

చిన్నారికి రూ.16 కోట్లు విలువ గల ఏవీఎక్స్‌ఎస్‌–101 ఇంజెక్షన్‌ వే­యా­లని వైద్యులు సూ­చించారు. ఈ ఇంజెక్షన్‌ భారతదేశంలో లేకపోవడంతో అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపినట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేటు ఉద్యోగంతో జీవనం సాగించే తాము ఇంత భారీమొత్తాన్ని భరించే స్థితిలో లేమని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు.
ఇంత భారీ మొత్తంలో డబ్బును సమకూర్చుకునే పరిస్థితిలో ఆ కుటుంబం లేదు. కావున మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమవంతు సాయంగా ఆ చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగు వేయాలని ప్రజాసంఘాల నాయకుకు నాగర్ దొడ్డి వెంకట్రాములు, కుర్వపల్లయ్య, అతికూర్ రెహ్మాన్, గాజుల క్రిష్ణారెడ్డి, తదితరులు విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసి, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.