- సామూహిక అత్యాచార కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్.
- అత్యాచారానికి పాల్పడిన ఏడు మందిని రిమాండ్ కు తరలింపు.
ముద్ర, నాగర్ కర్నూల్: ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడు మంది యువకులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు.బుధవారం కల్వకుర్తి డి. ఎస్. పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను హాజరు పరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఊరుకొండ పేటకు చెందిన మారుపాకుల ఆంజనేయులు, సిదిక్ బాబా, ఓగుల్ దాస్ మనీ, కార్తీక్, మట్ట మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులు మొత్తం ఏడు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు.గత నెల మార్చి 29 శనివారం రాత్రి ఊరుకొండ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు ఓ వివాహిత బంధువుతో కలిసి వచ్చింది.రాత్రి 9:30 కు మలవిసర్జన కోసం ఆలయానికి సమీపంలో ఉన్న గుట్ట వద్దకు వెళ్ళింది.అక్కడే ఊరుకొండ పేటకు చెందిన నలుగురు యువకులు ఉన్నారు.దీంతో ఆమెను బలవంతంగా గుట్టలోకి తీసుకెళ్తుండగా బంధువు గమనించి అక్కడికి వెళ్లడంతో అతని వద్ద ఉన్న ఆరువేల రూపాయలను తీసుకొని చేతులు కట్టి చెట్టుకు కట్టేశారు.తన కళ్ళముందే ఆమె పై అత్యాచారం చేస్తూ ఫోటోలు చిత్రీకరించారు.గ్రామంలో ఉన్న మరో ముగ్గురికి ఫోన్ చేసి గుట్ట వద్దకు రావాలని నలుగురు నిందితుల్లో ఒకరు చెప్పడంతో వారు సైతం అక్కడికి వచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.సుమారు మూడు గంటల పాటు అక్కడే గడిపారు.వారి వెంట తెచ్చుకున్న నీటిని బాధితురాలికి ఇవ్వగా ఆమె నిరాకరించడంతో కోపంతో ముఖంపై మూత్రం పోశారు.ఇక్కడ జరిగిన సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు.దాంతో ఆమె అక్కడి నుండి తన బంధువుతో కలిసి ఉదయం రెండున్నర గంటల సమయంలో అక్కడి నుండి వెళ్ళిపోయింది.సోమవారం ఊరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెంటనే విచారణ చేపట్టి సీసీ కెమెరాలు మొబైల్ నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు.వారిని విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టులో హాజరు పరిచి కస్టడీలోకి తీసుకుంటామని అన్నారు.నిందితులు 22 నుండి 28 సంవత్సరాల వయసులోపు వారే వీరిలో మర్పాకుల ఆంజనేయులు మట్ట మహేష్ గౌడ్ వివాహితులు. మహేష్ గౌడ్ ఆలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని నిందితులకు కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలతో ముందుకెళ్లడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.సమావేశంలో కల్వకుర్తి డిఎస్పి వెంకటేశ్వర్లు.కల్వకుర్తి వెల్దండ సిఐలు నాగార్జున ,విష్ణువర్ధన్ రెడ్డి, ఊరుకొండ కల్వకుర్తి ఎస్ఐ కృష్ణదేవరాయ, మాధవరెడ్డి పాల్గొన్నారు.