ముద్ర మల్కాజిగిరి
ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్ లో నూతన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.యుద్ధప్రాతిపదికన చదును చేస్తుండటం స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి ఫలితంగా అధికారులు అక్కడ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి బిఆర్ ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి కలిసి శనివారం పరిశీలించారు.
మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సరికొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి సమీపంలో ఉన్న ఉప్పల్ భగాయత్ ప్రాంతం అనువైన ప్రదేశంగా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మూసీ నది సమీపంలో విస్తృతమైన రహదారులు, పార్కులతో అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్‌లో పెద్ద స్థలం అందుబాటులో ఉండటం ఈ నిర్ణయానికి కారణమని చెబుతున్నారు. గురువారం ఆకస్మికంగా అధికారులు ఆ స్థలాన్ని చదును చేయించడం కూడా ఈ ప్రాంతంలోనే కార్పొరేషన్ కార్యాలయం నిర్మాణం జరగవచ్చన్న చర్చకు దారితీసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నగరానికి దగ్గరగా ఉండటం, భౌగోళికంగా మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ కేంద్ర బిందువుగా ఉండటం, విస్తారమైన స్థలం అందుబాటులో ఉండటం వంటి అంశాల కారణంగా ఇక్కడే కార్పొరేషన్ కార్యాలయం నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు