Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ మెట్రోఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్

మెట్రో ఫేజ్ -2కు ప్రాథమిక డీపీఆర్
రెండో దశలో 76.4 కిలోమీటర్లు
ఐదు కారిడార్లు
అంచనా వ్యయం రూ. 24 వేల కోట్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ ఖరారు అవుతోంది. ఈ దశంలో మొత్తం ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాలను నిర్మించనున్నారు. నాగోల్-శంషాబాద్.. రాయదుర్గం-నియోపోలిస్.. ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట.. మియాపూర్-పటాన్‌చెరు.. ఎల్బీ నగర్-హయత్ నగర్ మార్గాల్లో మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా.. దాని వల్ల పెరుగుతున్న ట్రాఫిక్‌ను పెరగకుండా ఉంచేందుకు ఈ మెట్రో రెండో దశ విస్తరణ చాలా కీలకం కానుంది.
హైదరాబాద్ నగరవాసులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతోపాటు.. నగరంలోని మరిన్ని ప్రాంతాలకు మెట్రో రైలును విస్తరించేందుకు ఈ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మెట్రో విస్తరణ జరిగితే.. లక్షలాది మంది నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో ఫేజ్-2కు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ తాజాగా ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.24,269 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా కొత్తగా మరో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు ఏర్పాటు కానున్నాయి. ఇక ఈ మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ సర్కార్.. పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రిపోర్ట్‌ను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇక ఈ మెట్రో ఫేజ్-2 నిర్మాణం కోసం కావాల్సిన 2787 ఎకరాల భూమిని సేకరించేందుకు ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర మంత్రివర్గం భారీగా నిధులు కూడా మంజూరు చేసింది.

నాగోల్-శంషాబాద్ కారిడార్
మరోవైపు.. ఈ రెండో దశలో 5 కొత్త కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మేర కొత్తగా మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గంలో 24 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులు.. రోడ్లపై ఉండే ట్రాఫిక్‌ భయం లేకుండా మెట్రోలోనే ఎయిర్‌పోర్టుకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో ఎక్కువ భాగం ఎలివేటెడ్ మార్గాన్నే నిర్మించనుండగా.. కొంత భాగం భూగర్భంలో 1.6 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.

రాయదుర్గం-కోకాపేట్ నియోపోలిస్ కారిడార్
మరోవైపు.. రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు మరో కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. 11.6 కిలోమీటర్ల ఈ మార్గంలో మొత్తం 8 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ రాయదుర్గం- కోకాపేట్ నియోపోలిస్ కారిడార్ నిర్మాణం పూర్తి అయితే.. ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి భారీ ఉపశమనం కలగనుంది. ఈ ప్రాంతాల్లో ఆఫీసులు ఉన్నవారికి.. మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట కారిడార్
ఇక మరో కారిడార్‌లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ చేయనున్నారు. 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. ఈ మార్గం పూర్తి అయితే పాతబస్తీలో ఉన్న ప్రాంతాలకు కూడా మెరుగైన మెట్రో కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది.

మియాపూర్-పటాన్‌చెరు కారిడార్
వీటితోపాటు.. మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు మరో కారిడార్‌ను విస్తరించనున్నారు. 13.4 కిలోమీటర్ల మేర ఉండే ఈ కారిడార్‌లో 10 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. ముంబై హైవేపై ఇప్పటికే ఉన్న నాగోల్-మియాపూర్ రెడ్ లైన్ మార్గాన్ని మరింత దూరం విస్తరించనున్నారు.

ఎల్‌బీ నగర్-హయత్‌నగర్ కారిడార్
ఎల్‌బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా మరో కారిడార్ అందుబాటులోకి రానున్నాయి. 7.1 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కారిడార్‌లో 6 స్టేషన్లను నిర్మించనున్నారు. మియాపూర్-ఎల్బీ నగర్‌ రెడ్ లైన్ మార్గాన్ని మరింత విస్తరించి.. విజయవాడ హైవేపై ఈ ఎల్బీనగర్-హయత్‌నగర్ కారిడార్ ఏర్పాటు కానుంది. ఈ 5 కారిడార్లలో మెట్రో అందుబాటులోకి వస్తే.. రోడ్లపై వాహనాల రద్దీ భారీగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మెట్రో రెండో దశ ప్రాజెక్టు పూర్తయి.. హైదరాబాద్ శివార్ల వరకు కూడా కనెక్టివిటీ జరిగితే.. ఆయా ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి ఉద్యోగులకు భారీగా ప్రయోజనం కలగనుంది.

Leave A Reply

Your email address will not be published.