Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్యలు ప్రణీత్ రావును సీఐగా డిమోట్

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు ప్రణీత్ రావును డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్ చేసింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న దుగ్యాల ప్రణీత్ రావు హోదాను తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీఎస్పీ స్థాయి నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక పోలీసు అధికారిని డీఎస్పీ హోదా నుంచి సీఐగా డిమోట్ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో పనిచేసిన ప్రణీత్ రావు, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన ప్రణీత్ రావుకు గత కేసీఆర్ ప్రభుత్వం యాక్సిలరేటెడ్ పదోన్నతి కింద డీఎస్పీగా ప్రమోషన్ ఇచ్చింది. అయితే, ప్రొబేషన్ కాలంలోనే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలను ధ్వంసం చేసినట్లు సిట్ విచారణలో తేలింది. దీంతో ఆయనకు గతంలో ఇచ్చిన ఆ పదోన్నతిని రద్దు చేస్తూ హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ నివేదిక ప్రాథమిక సమాచారం ప్రకారం, 2023 నవంబర్ 15న ఒక్కరోజే దాదాపు 650 ఫోన్లను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబీ కార్యాలయంలోని డేటాను, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సిట్ భావిస్తోంది. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. తాజా డిమోషన్ ఉత్తర్వులతో ప్రణీత్ రావు ఇకపై ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగనున్నారు.

Leave A Reply

Your email address will not be published.