ముద్ర, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సిఎంసి కమిషనర్ జి.సృజన బుధవారం జోనల్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే
ఐఏఎస్., ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, యూబీడీ, యూసీడీ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులన్నింటినీ ’99 రోజుల ప్రోగ్రాం’లో భాగంగా జూన్ 2nd, 2026 లోపు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. కనీసం 190 పనులను ఈ గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
రోడ్ల నిర్వహణ: జోన్‌లోని అన్ని రోడ్లకు ఎండ్-టు-ఎండ్ కార్పెటింగ్ చేయాలని, ఎక్కడా గుంతలు లేకుండా జూన్ 2 లోపు మరమ్మతులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే రోడ్లపై ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ చివరి నాటికి జోన్ అంతటా పూడికతీత పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీధి దీపాల సమస్యలపై అసిస్టెంట్ ఇంజనీర్లు తక్షణమే స్పందించాలని, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
ఆస్తుల వివరాలు: క్రీడా ప్రాంగణాలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి ప్రభుత్వ ఆస్తుల పూర్తి సమాచారాన్ని సేకరించాలని, ఖాళీ స్థలాలకు 10 రోజుల్లోపు హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పరిశుభ్రత మరియు దోమల నివారణ: చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు మే చివరి నాటికి పూర్తి కావాలని, దోమల నివారణకు 10 రోజులకు ఒకసారి ప్రతి ప్రాంతంలో ఫాగింగ్, స్ప్రేయింగ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించాలని కమిషనర్ తెలిపారు.
జంక్షన్ల సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులను వినియోగించుకోవాలని సూచించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, విభాగాల మధ్య సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.